● 27 మోటారు బైకుల స్వాధీనం
● వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాసరావు
ఒంగోలు టౌన్: కళ్లు మూసి తెరిచేలోపే మోటారు బైకులను చోరీ చేసి ఉడాయించే దొంగను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వివరాలను డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు మంగళవారం తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. కొత్తపట్నం మండలం పాదర్తి గ్రామానికి చెందిన అద్దేటి ఏడుకొండలు చెడు వ్యసనాలకు బానిసై, సులభంగా డబ్బు సంపాదించే ఉద్దేశంతో మోటారు బైకులు చోరీ చేయడం మొదలుపెట్టాడు. ఒంగోలు ఒన్‌టౌన్, టూ టౌన్, తాలుకా పోలీసు స్టేషన్ల పరిధిలోనే కాకుండా మద్దిపాడు, అద్దంకి, పల్నాడు జిల్లా వినుకొండ, నరసరావుపేట, గుంటూరు జిల్లా నగరంపాలెం, కొండూరు పోలీసు స్టేషన్ల పరిధిలో మొత్తం 27 మోటారు బైకులను దొంగిలించాడు. మంగళవారం నగరంలోని మామిడిపాలెం సెంటర్ నుంచి భాగ్యనగర్ వెళ్లే దారిలో వేణుగోపాల స్వామి గుడి వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా గంజాయితో సహా పట్టుబడ్డాడు. తహసీల్దార్ మధుసూదనరావు సమక్షంలో గంజాయి స్వాధీనం చేసుకున్నామని, బైకులను సీజ్ చేశామని డీఎస్పీ వివరించారు. కాగా, బైకుల చోరీ కేసును ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన డీఎస్పీతోపాటుగా సీఐ నాగరాజు, ఏఎస్సై కె.సురేష్, హెచ్‌సీలు ఎం.సాయి, జి.విజయ్, కానిస్టేబుల్ అనిల్ తదితరులను ఎస్పీ హర్షవర్థన్ రాజు అభినందించారు.


