ఆధ్యాత్మిక సౌరభం | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక సౌరభం

Mar 31 2026 7:20 AM | Updated on Mar 31 2026 7:20 AM

మార్కాపురం టౌన్‌: మార్కాపురం చెన్నకేశవ స్వామి ఆలయం విజయనగర రాజుల చరిత్రకు సజీవ సాక్ష్యం. ఈ ఆలయాన్ని క్రీ.శ. 1405 నుంచి 1459 సంవత్సరాల మధ్య కాలంలో విజయనగర చక్రవర్తులు నిర్మించినట్లు దేవాలయాల్లోని 18 శాసనాల ద్వారా తెలుస్తోంది. నెల్లూరు సీమను పరిపాలించిన సిద్దిరాజు తిమ్మ రాజయ్య రాయలవారి ఆదేశాల మేరకు మార్కాపురం చెన్నకేశవ స్వామి గర్భాలయ, అంతరాలయ, మధ్యరంగ మండపాలు, మహాద్వార నిర్మాణం, గర్భగుడిపై విమాన గోపుర నిర్మాణాలు జరిగాయి. 1529న అచ్యుత దేవ మహారాయులు మిగిలిన దేవాలయాన్ని నిర్మించారు. గాలి గోపురాన్ని 1929లో లింగరాజు అనే భక్తుడు, అనంతరం రామనం యోగేశ్వరరావులు పూర్తి చేశారు. 1936లో శ్రీరంగం శ్రీవాసమమలై జీయర్‌స్వామి గోపుర కలశ స్థాపన మహా సంప్రోక్షణ కుంభాభిషేకం నిర్వహించారు. ఈ గోపురం జీర్ణోద్ధరణ 2013లో శ్రీ త్రిదండి చిన జీయర్‌ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు

అద్భుత శిలా సంపద:

చెన్నకేశవుని ఆలయం అద్భుత శిల్ప సంపదకు నిలయం. అన్నదమ్ముల స్తంభాలు ఆశ్చర్య చకితులను చేస్తాయి. ఆస్థాన మండపం చుట్టూ ఒకే రాతితో చుంచు నిర్మాణంలో ఒంపులతో చెక్కడంతో శోభాయమానంగా కనిపిస్తుంది. చుంచుకూ విశేషమైన ప్రాముఖ్యం ఉంది. మానవ దేహానికి సంకేతాలుగా 9 అంతస్తులతో, గవాక్షాలతో అతిసుందర గాలిగోపురం ఈ క్షేత్రం ప్రత్యేకం. ఆలయంలో 13 మంది ఆళ్వార్లు, వేణుగోపాలస్వామి, లక్ష్మీనరసింహస్వామి, గోదాదేవి, శ్రీదేవి భూదేవి సమేత రంగనాయకస్వామి అంతరాలయాలు ఉంటాయి. ఉత్సవమూర్తులు నిత్య నీరాజనాలు, పూజలు అందుకోవడం ఆలయంలో విశేషం. శ్రీదేవి భూదేవిలతో కలిసి చెన్నకేశవుడు భక్తులను అనుగ్రహిస్తాడు. అన్నదమ్ములైన ఇద్దరు శిల్పులు మధ్యలో తెరకట్టి ఒకరినొకరు చూసుకోకుండా చెక్కిన శిల్పాలు అచ్చు ఒకేలా ఉంటాయి. మొత్తం 40 స్తంభాలు సకల ప్రాణి సమూహాలకు చిహ్నాలుగా ఉంటాయి. ఈ ఆలయంలో స్వామి వారికి చక్రం, శంఖం, గధ ఉండి ఎడమ చేతిలో శేషచక్రం కలిగి ఉండటం విశేషం. కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా భక్తులకు కొంగు బంగారమైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం దక్షిణ భారతదేశంలో కీర్తిప్రతిష్టలు సంపాదించింది. ధనుర్మాసంలో సూర్యకిరణాలు గర్భాలయంలోని స్వామి మూలవిరాట్‌ను ఆపాదమస్తకం అభిషేకించడం ఈ ఆలయ ప్రత్యేకత.

ఉత్సవాలు ఇలా...

చైత్రశుద్ధ పౌర్ణమి రోజున స్వామి వారి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 14 రోజుల పాటు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఏప్రిల్‌ 1 నుంచి 13వ తేదీ వరకు లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నెల 1న అంకురార్పణ, 2వ తేదీ గురువారం సూర్యవాహనం, (తెల్లవారితే శుక్రవారం స్వామి వారి కల్యాణం), 3న చంద్రవాహనం, 4న సింహ, 5న శేష, 6న వ్యాళి, 7న పొన్న, 8న హనుమంత, 9న గరుడ, 10న గజ వాహనం, 11న సాయంత్రం 4.30 గంటలకు రథోత్సవం జరుగుతుంది. 12న అశ్వవాహనం, 13న హంస వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అలాగే స్వామివారికి వసంతోత్సవం, ఊంజల్‌ సేవ నిర్వహించనున్నారు. చెన్నకేశవ స్వామివారి ఆలయంలో రూ.8 కోట్లతో నాలుగు ప్రకార రాజగోపురాలను నిర్మించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రకార రాజగోపురాలు భక్తులను ఆకట్టుకోనున్నాయి. ఈనెల 4న రాజగోపురాలకు కలశాలు, నూతన ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement