బేస్తవారిపేట: భార్య పట్ల ప్రవర్తన మార్చుకోవాలని మందలించినందుకు చిన్న మామను హత్య చేశాడని మార్కాపురం డీఎస్పీ యు నాగరాజు అన్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సోమవారం సాయంత్రం బేస్తవారిపేటలోని గాంధీబజార్ సమీపంలో ఈనెల 22వ తేదీన జరిగిన హత్య కేసుపై విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. కొమరోలు మండలం పొట్టిరెడ్డిపల్లెకు చెందిన పొద్దుటూరి పీరావలికి బేస్తవారిపేటకు చెందిన దూదేకుల రాజాహుస్సేన్ కుమార్తె కరిష్మాతో జనవరి 24న వివాహమైంది. అయితే పీరావలి భార్యను సక్రమంగా పట్టించుకోకుండా శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. విషయం కరిష్మా తల్లిదండ్రులకు, బాబాయ్ కుటుంబ సభ్యులకు తెలిపింది. ఈ విషయంపై పీరావలిని చిన్నమామ ఖాజావలి మందలించారు. దీంతో కక్ష పెంచుకున్న పీరావలి ఎలాగైన చిన్నమామను హత్య చేయాలని యూట్యూబ్‌లో మర్డర్ చేసే వీడియోలు చూశాడు. దూదేకుల ఖాజావలి ఇంట్లో నిద్రపోతున్న సమయంలో రోకలిబండతో తలపై కొట్టి కత్తితో గొంతులో పొడిచాడు. దీంతో ఖాజావలి అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం సొంతమామ ఇంటి వద్దకు వెళ్లి ఇంట్లో నిద్రపోతున్న రాజాహుస్సేన్‌ను చంపేందుకు ఫోర్క్ స్పూన్‌తో దాడిచేశాడు. మామ, అత్త అప్రమత్తమై దాడిని అడ్డుకుని అల్లుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. హంతకుడు బయటకు పరుగెత్తి పరారయ్యాడు. నిందితున్ని సోమవారం బేస్తవారిపేట ఆర్‌కే జంక్షన్‌లో కంభం సీఐ మల్లికార్జున అరెస్ట్ చేశారు. కార్యక్రమంలో ఎస్సై ఎస్‌వీ రవీంద్రారెడ్డి పాల్గొన్నారు.


