మార్కాపురం టౌన్: అధికారుల తీరుపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరిగింది. అయితే కొంత మంది అధికారులు ప్రజల సమస్యలను నిర్లక్ష్యంగా తీసుకోవడం, అనుమతి లేకుండా వేదిక నుంచి వెళ్లిపోవడం వంటి విషయాలను కలెక్టర్ తీవ్రంగా తప్పుపట్టారు. ఎటువంటి అనుమతి లేకుండా వేదిక నుంచి ఎలా వెళ్లిపోతారని అసహనం వ్యక్తం చేశారు. అర్జీలను పరిష్కరించకుండా మాయమాటలతో క్లోజ్ చేయడం మంచి పద్ధతి కాదన్నారు. సమస్యలను లాజికల్‌గా పరిశీలించి పరిష్కారం చూపేలా పనిచేయాలని ఆదేశించారు. ప్రజలు తిరస్కరించే విధంగా తహసీల్దార్లు ప్రవర్తించవద్దని హితవు పలికారు. ప్రజా సేవకోసమే ఉన్నామని, ప్రతి సమస్యను బాధ్యతగా తీసుకోవాలన్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలో రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి అర్జీని క్షణంగా పరిశీలించి వ్యక్తిగతంగా విచారించి ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. పీజీఆర్‌ఎస్‌ను సీరియస్‌గా తీసుకోవాలని, పెండింగ్‌లో ఉన్న మండలాలపై ప్రత్యేక సమీక్ష నిర్వహించి, నిర్లక్ష్యం చేసిన తహశీల్దార్‌లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి సోమవారం జిల్లా అధికారులంతా తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. అన్ని అర్జీలను కేటగిరి వారీగా విభజించి సమర్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, ఆర్డీఓ పి.ప్రభాకర్, కనిగిరి ఇన్‌చార్జి ఆర్డీఓ శివరామిరెడ్డి, గనులశాఖ ఏడీ రవివర్మ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాలాజీ నాయక్, ఉద్యానవనశాఖ అధికారి రమేష్, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్డు డైరెక్టర్ జెన్నమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశం
ప్రజలు తిరస్కరించే విధంగా ప్రవర్తించవద్దని హితవు


