అద్దంకి రూరల్: తాకట్టు పెట్టిన సొమ్ము తిరిగి ఇవ్వనంటున్న వ్యాపారిపై ఎస్టీలు ధర్నాకు దిగారు. ఈ సంఘటన సోమవారం రాత్రి అద్దంకిలో జరిగింది. ఎస్టీలు తెలిపిన వివరాల మేరకు..తాము 7 ఏళ్ల క్రితం కాలనీలోని 20 మంది బంగారు చైన్లు, ఉంగరాలను పట్టణంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న వ్యాపారి వద్ద 20 సవర్ల వరకు తాకట్టు పెట్టి కొంత నగదు తీసుకున్నారు. పనులు చేసుకునేందుకు దూరప్రాంతాలకు వెళ్లి 5 నెలల క్రితం తిరిగి వచ్చి డబ్బు చెల్లిస్తాం బంగారం ఇవ్వమని వ్యాపారిని అడిగారు. అయితే ఆ వ్యాపారి బంగారం లాకర్లో ఉందని తీసుకువచ్చి ఇస్తానని ఇన్నిరోజులు కాలయాపన చేశాడు. ఇప్పుడు తన వద్ద బంగారం లేదని, మీ ఇష్టం వచ్చిన వారి చెప్పుకోండని దుర్భాషకు దిగాడు. దీంతో చేసేది లేక వారంతా పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో సోమవారం షాపు వద్ద ధర్నాకు దిగారు. వ్యాపారికి అధికార పార్టీ అండ ఉండటంతోనే చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు.


