అమరావతికి
కనిగిరి రూరల్: ప్రజలు, రైతులను మభ్యపెట్టేందుకు అమరావతి రాజధానికి చట్టబద్ధత, అసెంబ్లీలో తీర్మానం అంటూ సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారని వైఎస్సార్ సీపీ కనిగిరి ఇన్‌చార్జి దద్దాల నారాయణ యాదవ్ ధ్వజమెత్తారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతి పేరుతో జరుగుతున్న అవినీతిపై చర్చ జరగకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకు చట్టబద్ధత పేరుతో డ్రామాకు తెరలేపారన్నారు. అమరావతికి వైఎస్సార్ సీపీ వ్యతిరేకం కాదని, రాజధాని పేరుతో చేస్తున్న దోపిడీనే తాము ప్రశ్నిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తరువాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ ఐదేళ్ల పాటు అమరావతిలో అభివృద్ధికి ఖర్చు చేసింది కేవలం రూ.5 వేల కోట్లని, తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు పేరుతో కాలం గడిపారని గుర్తు చేశారు. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చాక అమరావతిలో రాజధాని అభివృద్ధి అంటూ వేల కోట్లు అప్పు చేశారన్నారు. గతంలోనే రాజధాని కోసం 50 వేల ఎకరాలు సేకరించారని, మళ్లీ ఇప్పుడు 30 వేల ఎకరాలు సేకరిస్తున్నారని, ఇంత భూమి ఎందుకని ప్రశ్నించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని, వైఎస్సార్ సీపీని విమర్శించడం కోసమే అసెంబ్లీ సమావేశం పెట్టారన్నారు. 2028కి అద్భుతమైన రాజధాని నిర్మాణం చేసి ప్రజలకు అంకితం చేస్తామని చెబుతూనే, మరోవైపు తరువాత ఎవరైనా అధికారంలోకి వచ్చినా రాజధాని ఇక్కడే ఉండాలని తీర్మానం చేస్తున్నారన్నారు. దీనిని బట్టి 2029లో మళ్లీ అధికారంలోకి వస్తామన్నా నమ్మకం చంద్రబాబుకే లేదని అర్ధమవుతోందన్నారు. కొత్త భవనాలు కట్టకుండా, పనులు చేయకుండా డిజైన్ల పేరుతో రూ.400 కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. పాత టెండర్లను రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలవడం అనుమానాస్పదంగా ఉందన్నారు. రెండేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం హామీల అమలులో విఫలం కావడం, పాలనలో వైఫల్యంతో టీడీపీ నేతల్లోనే నైరాశ్యం నెలకొందన్నారు. పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు, రాజధాని రైతులను మభ్యపెట్టేందుకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఊతమివ్వాలనే ఉద్దేశంతోనే రాజధానికి చట్టబద్ధత అంశాన్ని హడావిడిగా తెరపైకి తెచ్చారని దద్దాల నారాయణ యాదవ్ విమర్శించారు.
రెండో విడత పూలింగ్ కోసమే ఈ నాటకం
రాజధాని, ప్రజా సమస్యలపై దృష్టి మళ్లించడానికే సర్కార్ పన్నాగం
చంద్రబాబు తీరుపై కనిగిరి
వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి దద్దాల ధ్వజం


