పొన్నలూరు: కందుకూరు నుంచి కనిగిరికి వెళ్తున్న బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన మండల పరిధిలోని నాగిరెడ్డిపాలెం సమీపంలో సోమవారం జరిగింది. స్థానికులు వివరాలు మేరకు.. కనిగిరి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు మధ్యాహ్న సమయంలో కందుకూరు నుంచి కనిగిరి ప్రాంతానికి బయలుదేరింది. ఈ బస్సులో సుమారుగా 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. అయితే నాగిరెడ్డిపాలెం సమీపంలోకి రాగానే బస్సు స్టీరింగ్ సాంకేతిక లోపంతో అదుపు కోల్పోయింది. దీన్ని గమనించిన డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సుకు ప్రమాదం జరగకుండా వెంటనే పక్కనే ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లాడు. దీంతో కొంత దూరం వెళ్లిన తరువాత బస్సు ఆగిపోయింది. ప్రమాదంలో కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా, బస్సు ముందు భాగం కొంతమేర దెబ్బతింది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పిపోయి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ప్రయాణికులకు స్వల్ప గాయాలు
తప్పిన పెను ప్రమాదం


