ఉసురు తీస్తున్న వలసలు.. | - | Sakshi
Sakshi News home page

ఉసురు తీస్తున్న వలసలు..

Mar 27 2026 9:33 AM | Updated on Mar 27 2026 9:33 AM

మార్కాపురం/పొదిలి: సంవత్సరాల తరబడి పాలకులు వెనుకబడిన ప్రాంతంలోని మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, కనిగిరి ఏరియాల్లో కూలీలకు శాశ్వత ఉపాధి కల్పించే పరిశ్రమలను, పనులను కల్పించకపోవడంతో వలసలు అనివార్యమయ్యాయి. ఈ క్రమంలో బస్సు, లేదా ఇతర ప్రయాణికుల రవాణా వాహనాలు ప్రమాదాలు జరిగిన సంఘటనల్లో వలస కూలీలే ఎక్కువగా మృత్యువాత పడుతున్నారు. కనిగిరి ప్రాంతంలోని నిమ్జ్‌, దొనకొండ ఏరియాలకు సంబంధించిన పారిశ్రామికవాడ ఆయా చోట్ల నిర్దేశించిన ఎంఎస్‌ఎంఈ పార్కులు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. దీంతో వందలాది మంది కూలీలు తెలంగాణ ప్రాంతాల్లో, బెంగళూరుకు వలసలు వెళ్తున్నారు. వలసలను నివారించి స్థానికంగా ఉపాధి కల్పించాలని ప్రభుత్వాలను ప్రజలు, కూలీలు డిమాండ్‌ చేస్తున్నారు.

మృత్యువార్త చెప్పలేక.. చెప్పకుండా ఉండలేక..

ప్రమాద ఘటనలు మృతి చెందిన వారి వివరాలు వైద్యశాల అధికారులు సిబ్బందికి తెలిసినప్పటికీ వారి బంధువులకు చెప్పేందుకు కొంత సంశయించారు. మరణించిన వారి మృతదేహాలను కచ్చితంగా గుర్తించలేకపోవడం ఒక కారణంగా తెలుస్తోంది. మరో వైపు వారి బంధువులు కుటుంబ సభ్యుల పరిస్థితిని గమనించిన వైద్యశాల సిబ్బంది వారికి మరణ వార్త సమాచారం ఇచ్చేందుకు కొంత జాప్యం చేశారు. దీంతో తమ వారు ఏమయ్యారో తెలియక కుటుంబ సభ్యులు కొంతసేపు అల్లాడిపోయారు. ఎట్టకేలకు నిర్ధారించుకుని వైద్యశాల సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

బస్సు మార్కాపురం ఎందుకు వచ్చినట్టో..!

తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో బయలుదేరిన బస్సు గమ్యస్థానమైన నెల్లూరు జిల్లా వింజమూరుకు చేరాల్సి ఉంది. ఈ క్రమంలో వినుకొండలో దిగేందుకు ఎక్కిన ప్రయాణికులను మాచర్లలోనే దించినట్టుగా తెలుస్తోంది. మరో వైపు వినుకొండ స్టేజీలో ఈ బస్సులో ముగ్గురు ప్రయాణికులు ఎక్కాల్సి ఉంది. వినుకొండ వైపునకు వెళ్లకుండా మాచర్ల నుంచి మార్కాపురం వైపునకు ఈ బస్సు రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. రూటు పర్మిట్‌ ఒక వైపునకు తీసుకుని మరో రూటులో ప్రయాణాలు సాగిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మార్కాపురంలో దిగాల్సిన ప్రయాణికులు కూడా బస్సులో ఎవరూ లేరు. వినుకొండ, కురిచేడు, దర్శి, పొదిలి షార్ట్‌కట్‌ రూట్‌ అయినా మార్కాపురానికి బస్సు ఎందుకు వచ్చిందనేది అధికారుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement