మార్కాపురం:
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమ ప్రకాశంలో సుమారు 7 లక్షల మంది ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో మార్కాపురం మండలం రాయవరం వద్ద సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో రూ.475 కోట్లు మంజూరు చేసి పనులను ప్రారంభించారు. సుమారు 70 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి. అయితే 2024 ఎన్నికల నోటిపికేషన్‌తో పనులు ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి రావడంతో మెడికల్ కళాశాల పనులను నిలిపివేసింది. దీంతో నిర్మాణ సామగ్రిని, సంబంధిత సంస్థ తరలించుకునిపోయింది. ఆ తరువాత పీపీపీ విధానంలో నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించినా కాంట్రాక్టర్లు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో రెండేళ్ల నుంచి మెడికల్ కళాశాల పనులు నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే మెడికల్ కాలేజీని నిర్మించాలని వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన లభించింది. నాడు జిల్లా వైద్యశాలను జీజీహెచ్‌గా మార్చి 75 మంది స్పెషలిస్టు వైద్యులను, 500 బెడ్లను ఏర్పాటుచేయగా కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రస్తుతం మార్కాపురం జీజీహెచ్‌లో 14 మంది మాత్రమే వైద్యులు సేవలందిస్తున్నారు. ఇక్కడ ఉన్న డాక్టర్లను కర్నూలు, ఒంగోలు, గుంటూరు, ఏలూరు తదితర మెడికల్ కాలేజీలకు బదిలీ చేశారు.
గురువారం ఉదయం మార్కాపురం మెడికల్ కళాశాల సమీపంలో జరిగిన దుర్ఘటనలో 14 మంది చనిపోగా 28 మంది గాయపడ్డారు. అయితే స్థానికంగా వైద్యులు, సిబ్బంది, అత్యాధునిక వైద్యపరికరాలు లేకపోవడంతో క్షతగాత్రులకు తాత్కాలిక చికిత్స చేసి ఒంగోలు, గుంటూరు తరలించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మార్కాపురంలో మెడికల్ కాలేజీని ఈ రెండేళ్లలో పూర్తి చేసి ఉంటే ఈ ప్రాంత ప్రజలకు బాధితులకు అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులోకి వచ్చి ఉండేవని పలువురు వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వ తీరును ఖండించారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరిచి ఈ ప్రాంత ప్రజల కోసం ప్రభుత్వమే మెడికల్ కాలేజీని కట్టాలని కోరుతున్నారు.


