నీటి కుంటలో మునిగి విద్యార్థి మృతి | - | Sakshi
Sakshi News home page

నీటి కుంటలో మునిగి విద్యార్థి మృతి

Feb 10 2026 7:18 AM | Updated on Feb 10 2026 7:18 AM

నీటి

నీటి కుంటలో మునిగి విద్యార్థి మృతి

నీటి కుంటలో మునిగి విద్యార్థి మృతి

9వ తరగతి విద్యార్థులు పార్టీనా..?

కందుకూరు: ఓ ప్రైవేట్‌ స్కూల్‌ యజమాన్యం నిర్లక్ష్యానికి ఎంతో భవిష్యత్‌ ఉన్న ఓ విద్యార్థి నిండుప్రాణం బలైంది. ఆదివారం స్కూల్‌ హాస్టల్‌ నుంచి బయటకు వెళ్లిన విద్యార్థి చివరకు కుంటలో శవమై తేలాడు. ఈ సంఘటన సోమవారం కందుకూరు పట్టణంలో వెలుగులోకి వచ్చింది. బాధిత తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం...పీసీపల్లి మండలం లక్ష్మక్కపల్లి గ్రామానికి చెందిన నరాల మధుసూదన్‌రెడ్డి, భాగ్యలక్ష్మీ కుమారుడు వెంకట మణిదీప్‌రెడ్డి(14) పట్టణంలోని కోవూరు రోడ్డులోని విజ్ఞాన్‌ విహార్‌ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. స్కూల్‌ హాస్టల్‌లోనే ఉంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో తండ్రికి ఫోన్‌ చేసిన మణిదీప్‌రెడ్డి డబ్బులు కావాలని అడిగాడు. నేను సోమవారం స్కూల్‌ దగ్గరికి వస్తాను, అప్పుడు ఇస్తానులే అని చెప్పిన మధుసూదన్‌రెడ్డి జాగ్రత్తగా ఉండాలంటూ కుమారుడికి సూచించాడు. ఇంతలోనే ముగ్గురు స్నేహితులు వచ్చి పార్టీ చేసుకుందాం బయటకు వెళ్దాం రా అని పిలవడంతో వారితో కలిసి మణిదీప్‌రెడ్డి బయటకు వెళ్లాడు. ఆ తరువాత నలుగురు కలిసి పట్టణంలోని 60అడుగుల రోడ్డు చివరలో ఉన్న కోమటికుంట వద్దకు వెళ్లారు. అక్కడ బిర్యానీతో పాటు, థమ్స్‌ఆప్‌ బాటిల్స్‌తో పార్టీ చేసుకున్నారు. అనంతరం ఈత కొట్టేందుకు అంటూ కోమటికుంటలోకి దిగారు. మణిదీప్‌రెడ్డి ఈతరాదని చెప్తున్నా తోటి స్నేహితుల బలవంతంగా భుజాలపై ఎక్కించుకుని కుంటలోకి దిగారు. ఈ క్రమంలో లోతైన ప్రదేశంలో మణిదీప్‌రెడ్డి ఒక్కసారిగా నీళ్లలోకి మునిగిపోయాడు. ఈ సంఘటనతో భయపడిపోయిన మిగిలిన ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు. స్కూల్‌కు కూడా వెళ్లకుండా నేరుగా ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో నీటికుంటలో మునిగిన మణిదీప్‌రెడ్డి కుంటలోనే ప్రాణాలు వదిలాడు.

శవాన్ని వెతికి బయటకు తీసిన బంధువులు

అయితే ఆదివారం మధ్యాహ్నం హాస్టల్‌ నుంచి బయటకు వెళ్లిన మణిదీప్‌రెడ్డి తిరిగి హాస్టల్‌కు చేరకపోయినా స్కూల్‌ యాజమాన్యం తల్లిదండ్రులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. తీరిగ్గా సోమవారం ఉదయం తండ్రి మధుసూదన్‌రెడ్డికి ఫోన్‌ చేసి మీ పిల్లవాడు ఏమైనా ఇంటికి వచ్చాడా అని హాస్టల్‌ వార్డెన్‌ అడగడంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు హడావుడిగా కందుకూరు వచ్చారు. తీరా వచ్చిన తరువాత అసలు విషయం తెలిసింది. దీంతో బంధువులతో కలిసి ప్రమాదం జరిగిన కోమటికుంట వద్దకు చేరుకుని కుంట వద్ద కుమారుడి దుస్తులు చూసి బోరున విలపించారు. బంధువులు కొందరు నీటి కుంటలోకి దిగి వెతకడం ప్రారంభించడంతో మణిదీప్‌రెడ్డి మృతదేహం దొరికింది. దీంతో మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చి కన్నీటిపర్యంతమయ్యారు. ఆ కుటుంబం మొత్తాన్ని ఒక్కడే కుమారుడు కావడంతో వారి ఆవేదన అంతా ఇంతా కాదు. చదువుకుని ప్రయోజకుడు అవుతాడనుకుంటే శవమై తేలాడంటూ బోరున విలపించారు.

స్కూల్‌ యాజమాన్యం నిర్లక్ష్యంపై

మండిపాటు

ఈ సందర్భంగా తల్లిదండ్రులతో పాటు, బంధువులు స్కూల్‌ యాజమాన్య నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్‌లో ఉన్న పిల్లవాడు బయటకు ఎలా వెళ్లాడు, ఒకవేళ వెళ్లినా తిరిగి హాస్టల్‌కు రాకపోతే తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అదే సందర్భంలో ప్రమాదం జరిగిందని తెలిసిన తరువాత కూడా కుంట వద్ద స్కూల్‌ యాజమాన్యం గానీ, సిబ్బంది గానీ రాకపోవడంపై మండిపడ్డారు. స్కూల్‌ బాగా లేదని చెప్తున్నా వినకుండా అక్కడే ఉంచి పిల్లాడిని పోగొట్టుకున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు.

విజ్ఞాన్‌విహార్‌ స్కూల్‌ హాస్టల్‌ నుంచి బయటకు వెళ్లి శవమై తేలిన విద్యార్థి

ఆదివారం తోటి స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన మణిదీప్‌రెడ్డి

సోమవారం ఉదయం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన స్కూల్‌ యాజమాన్యం

కోమటికుంటలో వెతికి శవాన్ని బయటకు తీసుకున్న విద్యార్థి బంధువులు

9వ తరగతి చదువుతున్న విద్యార్థులు పార్టీతో శివారు ప్రాంతానికి వెళ్లడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. బైక్‌పై వెళ్లిన విద్యార్థులు అక్కడే బిర్యానీ తినడంతో పాటు, థమ్స్‌బాటిల్‌లు, ప్లాస్టిక్‌ గ్లాసులు పడి ఉండడంతో, ఆ సమీపంలోనే రెండు మద్యం బాటిళ్లు దొరకడంపై మణిదీప్‌రెడ్డి బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. సంఘటన జరిగిన ప్రదేశంలోనే రెండు క్వార్టర్‌ బాటిళ్లు చిల్లచెట్లలో దొరికాయని, వీటిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారని చెప్పారు. మద్యంతాగి బలవంతంగా తమ పిల్లవాడిని లాక్కెళ్లి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఈ సంఘటనలో పాల్గొన్న మిగిలిన ముగ్గురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

నీటి కుంటలో మునిగి విద్యార్థి మృతి 1
1/2

నీటి కుంటలో మునిగి విద్యార్థి మృతి

నీటి కుంటలో మునిగి విద్యార్థి మృతి 2
2/2

నీటి కుంటలో మునిగి విద్యార్థి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement