పోటెత్తిన అర్జీదారులు
ఒంగోలు సబర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీదారులు పోటెత్తారు. జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది సమస్యలను జిల్లా అధికారులకు విన్నవించుకునుందుకు తరలివచ్చారు. గత రెండు సోమవారాలు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు కావడంతో ఈ సోమవారం కార్యక్రమానికి భారీగా పోటెత్తారు. అయితే వందల మంది అర్జీదారులు బారులుదీరి ఉన్నా భోజనం సమయం అయిందని జిల్లా అధికారులు వెళ్లిపోవడంతో వారంతా చేసేది లేక నిరాశతో వెనుదిరిగారు. కొంత మంది అలవాటు ప్రకారం మార్కాపురం జిల్లా నుంచి ఇక్కడకు వచ్చారు. వారిని అధికారులు బయట నుంచే మార్కాపురంలో నిర్వహిస్తున్న మీ కోసం కార్యక్రమానికి వెళ్లాలని పంపించారు.
అర్జీల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వద్దే ఆలస్యం..
మీ కోసం కార్యక్రమానికి వచ్చే అర్జీదారుల కోసం అర్జీలను ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసేందుకు కేవలం నాలుగు కంప్యూటర్లు మాత్రమే ఏర్పాటు చేశారు. దీంతో వందల సంఖ్యలో వచ్చిన అర్జీదారులతో సిబ్బందికి ఆన్‌లైన్ చేయడం గగనంగా మారింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ దగ్గర తోపులాటలు, నెట్టుకోవడంతో పాటు కొద్దిపాటి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వందల సంఖ్యలో అర్జీదారులు క్యూ లైన్లలో ఉన్నా మధ్యాహ్నం 2.30 గంటలు అయిందని జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్.ఓబులేసు ప్రకటించారు. జేసీ కల్పనా కుమారి, డీఆర్‌ఓ, ఇతర జిల్లా అధికారుల వద్దకు వెళ్లే వీలులేక అర్జీదారులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఆ తరువాత ఆర్‌డీఓ కౌంటర్లు, రెవెన్యూ కౌంటర్ల వద్దే అర్జీదారులు ఆగిపోయారు. జిల్లా అధికారులు వేదికపై లేకపోవడంతో వందలాది మంది అర్జీలు ఇవ్వకుండానే నిరాశతో వెనుతిరిగి వెళ్లిపోయారు. మొత్తంమీద 513 అర్జీలు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లో వచ్చాయి.
అర్జీదారులు ఉండగానే వెళ్లిపోయిన జిల్లా అధికారులు
నిరాశతో వెనుదిరిగిన అర్జీదారులు
పోటెత్తిన అర్జీదారులు


