కాలినడకన మల్లన్న చెంతకు..
శ్రీశైల పుణ్యక్షేత్రానికి భారీగా తరలివెళ్తున్న భక్తులు అటవీ మార్గంలో కాలినడకన పయనం
పెద్దదోర్నాల: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైల పుణ్యక్షేత్రంలోని శ్రీగిరి పర్వతంపై వెలసిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి తరలివెళ్లే శివభక్తుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. దీంతో శ్రీశైల ముఖద్వారంగా పేరొందిన దోర్నాలలో యాత్రికులు, శివస్వాములతో సందడి నెలకొంది. రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా శివస్వాములు కాలినడకన శ్రీశైలం తరలి వెళుతుండడంతో నల్లమల అటవీప్రాంతం శివనామస్మరణతో మారుమోగుతోంది. దోర్నాల నుంచి 50 కిలోమీటర్ల మేర దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంగుండా కాలినడకన శివస్వాములు శ్రీశైలం వెళ్లాల్సి ఉండడంతో వారి సౌకర్యార్థం పలువురు స్వచ్ఛందంగా ఉచిత భోజన వసతి, తాగునీటి సౌకర్యాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నేటి నుంచి బ్రహ్మోత్సవాలు:
శ్రీశైల మహాక్షేత్రంలో నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జునస్వామి వారికి విశేష అర్చనలు, మహాశక్తి స్వరూపిణి అయిన భ్రమరాంబాదేవికి ప్రత్యేక పూజలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిత్యహోమ బలిహరణలు, జపానుప్ఠానాలు, స్వామివారికి విశేష అర్చనలు, అమ్మవారికి నవావరణార్చనలు, రుద్రహోమం, చండీహోమం, సాయంత్రం నిత్యపూజలు, వాహన సేవలను కన్నుల పండువగా నిర్వహించనున్నారు.
మహాశివరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించాలి
● జేసీ శ్రీనివాసులు
త్రిపురాంతకం: జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన త్రిపురాంతకంలో బాలాత్రిపురసుందరీదేవి, పార్వతి సమేత త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయాల్లో మహా శివరాత్రి మహోత్సవాలను విజయవంతం చేసేందుకు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని మార్కాపురం జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఆదేశించారు. త్రిపురాంతకంలో శనివారం ఉత్సవాల నిర్వహణ సమాయత్త సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవాల నిర్వహణలో అన్ని శాఖల అధికారుల మధ్య సమన్వయం అవసరమన్నారు. ప్రతి శాఖ తమ పరిధిలో నిర్వహించాల్సిన పనులు సక్రమంగా నిర్వర్తించేలా చూడాలన్నారు. అవసరమైతే ఇతర మండలాలకు చెందిన సిబ్బందిని బృందాలుగా ఏరా్పాటు చేసి విధులకు హాజరయ్యేలా చూడాలన్నారు. సాగర్ కాలువలకు ఇరువైపులా ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 13 నుంచి 19 వ తేదీ వరకు మహాశివరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో సబ్‌కలెక్టర్ శివరామిరెడ్డి, డీఎస్పీ నాగరాజు, తహసీల్దార్ విజయభాస్కర్ అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
కాలినడకన మల్లన్న చెంతకు..


