దిక్కులేని ‘దిశ’
ఒంగోలు సబర్బన్: డిస్ట్రిక్ట్ డవలెప్‌మెంట్ కో ఆర్డినేషన్ అండ్ మోనటరింగ్ కమిటీ మీటింగ్ (దిశ) దిక్కులేనిదిగా మారింది. జిల్లా అభివృద్ధికి సంబంధించిన కీలక సమావేశం ప్రజాప్రతినిధులు లేక వెలవెలబోయింది. జిల్లాలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమీక్షించేందుకు ఎంపీ చైర్మన్‌గా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ సమావేశం నిర్వహిస్తారు. అందులో భాగంగా శనివారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ భవన్‌లో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అయితే, ఈ సమావేశానికి టీడీపీకి చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా హాజరుకాలేదు. చివరకు కొండపి ఎమ్మెల్యేగా ఉన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి స్వామి కూడా హాజరుకాకుండా ముఖం చాటేశారు. సమావేశంలో ఎమ్మెల్యేల కోసం ఏర్పాటు చేసిన సీట్లన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. జెడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా సమావేశానికి రావడానికి నిరాసక్తత వ్యక్తం చేసినట్లుగా దిశ సమావేశానికి వచ్చిన ప్రజాప్రతినిధులను బట్టి స్పష్టమవుతోంది.
ఒక్క ఎమ్మెల్యే కూడా హాజరుకాకపోవడంపై విమర్శలు...
ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఐదుగురు టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ సమావేశానికి వారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా హాజరుకాకపోవటంపై ప్రజల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
టీడీపీ ఇన్‌చార్జ్‌లు వస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల నిరసన...
గతంలో జరిగిన దిశ సమావేశాలకు ప్రొటోకాల్‌కు వ్యతిరేకంగా దర్శి, యర్రగొండపాలెం నియోజకవర్గాలకు చెందిన ఇన్‌చార్జ్‌లు వస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ నిరసన వ్యక్తం చేశారు. గతంలో కూడా యర్రగొండపాలెం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఈ విషయమై ప్రశ్నించారు కూడా. ఎలాంటి ప్రొటోకాల్ లేకుండా అధికారికంగా నిర్వహించే సమావేశాలకు ఏ విధంగా హాజరవుతారని నిలదీశారు కూడా. అందుకే ఈ సమావేశానికి రాకుండా సహాయ నిరాకరణ పాటించారు.
లోపాలను ప్రశ్నించేవారు లేక...
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలులో లోపాలపై ప్రశ్నించేవారే కరువయ్యారు. దీంతో అజెండా ప్రకారం అధికారులు వారు తెచ్చుకున్న నోట్స్‌ను చదువుకుంటూ పోయారు. అయితే సమావేశానికి వచ్చిన వెలిగండ్ల, హెచ్‌ఎం పాడు జెడ్పీటీసీలు, సంతనూతలపాడు, జరుగుమల్లి ఎంపీపీలు మాత్రమే స్థానికంగా ఉన్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు.
నగరంలో గంజాయి బ్యాచ్...
ఒంగోలు నగరంలో గంజాయి బ్యాచ్ ఎక్కువయ్యారని నగర మేయర్ గంగాడ సుజాత ఆందోళన వ్యక్తం చేశారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు వేయకపోవటం వల్ల వీధిలైట్లు లేక రాత్రి వేళల్లో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టిస్తున్నారని, వచ్చేపోయే వారిపై దాడులు చేస్తున్నారని, మహిళలు రాత్రి వేళల్లో తిరగటానికే భయపడుతున్నారని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా నగర శివారుతోపాటు, చెరువుకొమ్ముపాలెం వెళ్లే రోడ్డులో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. విద్యుత్ లైన్లు వేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఏపీసీపీడీసీఎల్ ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లుకు ఎంపీ సూచించారు. సమావేశంలో జేసీ కల్పనా కుమారి, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డీఆర్‌ఓ బీసీహెచ్ ఓబులేసు, డ్వామా, డీఆర్‌డీఏ, హౌసింగ్, ఆర్‌డబ్ల్యూఎస్, వ్యవసాయం, విద్యుత్, పరిశ్రమలు, పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్, చేనేత–జౌళి, మత్స్య, ఐసీడీఎస్, విద్యాశాఖ, జాతీయ రహదారులు, ఆర్‌అండ్‌బీ, రైల్వే, బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు పాల్గొన్నారు.


