కడవరకు కార్మిక నగర్‌లోనే..
కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగిన కార్మిక నగర్ బాధితులు బాధితులకు చట్టపరంగా రక్షణ కల్పించాలని సీపీఎం నాయకుల డిమాండ్
ఒంగోలు టౌన్: ‘‘నగరంలో తలదాచుకునేందుకు చారెడు జాగా లేకపోవడంతో ఇక్కడ రేకుల షెడ్డులు వేసుకొని జీవిస్తున్నాం... పది పన్నెండేళ్లుగా ఇక్కడే నివసిస్తున్నాం..ఇప్పుడు అర్ధంతరంగా మా ఇళ్లు పడగొట్టి బయటకు వెళ్లగొడితే మా పరిస్థితి ఏమిటి..ఎక్కడికి వెళ్లాలి..అందుకే చివరి శ్వాస వరకు ఇక్కడే ఉంటాం.. ఈ మట్టిలోనే చస్తామని’’ ఒంగోలులోని కార్మిక నగర్ కాలనీ నిర్వాసితులు ప్రకటించారు. కలెక్టరేట్ వద్ద బాధితులు సీపీఎం ఆధ్వర్యంలో శనివారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీకి చెందిన చెరుకూరి లక్ష్మి మాట్లాడుతూ ఏరోజుకారోజు పనులు చేసుకొని బతికేవాళ్లం, నగరంలో అద్దెలు చెల్లించే స్థోమత లేక, ఊరిబయట ప్రభుత్వ స్థలంలో రేకుల షెడ్డులు వేసుకొని బతుకీడుస్తున్నాం. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి, మా ఇళ్లు కూల్చిన వారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో కొందరు వ్యక్తులు నకిలీ రిజిస్ట్రేషన్ కాగితాలు తీసుకొచ్చి ఇళ్లు ఖాళీ చేయించాలని ప్రయత్నించారు, 2012, 2016లో తాము కోర్టుకు వెళితే తమకు అనుకూలంగా ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఒంగోలుకు చెందిన అల్లాబక్షు, ఉన్నం నరేష్, కోడే శ్రీనివాసరావు, విజయవాడకు చెందిన శ్రీనివాసరావు, పాడిబండ్ల కృష్ణ, ప్రవీణ్ అనే వ్యక్తులు కానిస్టేబుళ్లను తీసుకొచ్చి రాత్రి పూట దౌర్జన్యంగా ఇళ్లు కూల్చివేశారని ఆరోపించారు. సామానులు సర్దుకునేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని వాపోయారు. కార్మిక నగర్ నిర్వాసితులకు సీపీఎం మద్దతు తెలుపుతున్నట్లు నగర కమిటీ సభ్యుడు తంబి శ్రీనివాసరావు ప్రకటించారు. ముక్తినూతలపాడు సర్వే నంబర్ 186లోని కార్మిక నగర్ నిర్వాసితులకు చట్టపరంగా రక్షణ కల్పించాలని కోరారు. నిరుపేదలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం జేసీ కల్పనా కుమారికి వినతి పత్రం అందజేశారు. ఈ అంశంపై తక్షణమే విచారణ జరపాలని ఆమె రెవెన్యూ అధికారులకు ఆదేశించారని సీపీఎం నాయకులు తెలిపారు. కార్యక్రమంలో కాలనీకి చెందిన కారాణి దుర్గ, ఎస్‌కే సైదులు, బెల్లంకొండ వెంకట శేషయ్య, గరికపూడి సుధాకర్, అశోక్, పెదసింగు నాంచారమ్మ, మన్నేపల్లి ప్రమీల, చొప్పర సువార్తమ్మ పాల్గొన్నారు.


