శనివారం శ్రీ 7 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
న్యూస్‌రీల్
15న కోర్టు పోస్టులకు రాత పరీక్ష
పొగాకు పంటలను పరిశీలించిన బోర్డు ఈడీ
బాబు పాలనలో జీజీహెచ్ నిర్వీర్యం
మార్కాపురం జీజీహెచ్‌లో వైద్యసేవలు తగ్గిపోయాయని వైఎస్సార్ సీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. చల్లని గాలులు వీస్తాయి. పొగమంచు కురుస్తుంది.
ఏఆర్‌వీ ఇంజక్షన్లు అందుబాటులో లేవు...
జిల్లాలోని అన్నీ ప్రభుత్వ వైద్యశాలలు, ఒంగోలులోని సర్వజన ఆస్పత్రి, మార్కాపురంలోని జీజీహెచ్‌ల్లో ఏఆర్‌వీ ఇంజక్షన్లు, ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే తాళ్లూరు, ముండ్లమూరు మండలాల్లో ఏఆర్‌వీ ఇంజక్షన్లు అందుబాటులో లేవని, కుక్క కరిచినప్పుడు ఆస్పత్రికి వెళితే బయట మెడికల్ షాపులకు ఇంజక్షన్లు రాస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. కుక్క కరిస్తే ఒక్కొక్కరికి నాలుగు డోసుల ఇంజక్షన్ వేయాలి. బయట దుకాణాల్లో ఒక్కో డోసు రూ.500 అవుతోంది. ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజక్షన్ ఖరీదు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఉంటోంది.
రోడ్డుమీదకొస్తే చాలు గుంపులు గుంపులుగా కనిపించే శునకాలు ప్రజలకు వణుకు పుట్టిస్తున్నాయి. పగలు, రాత్రి తేడా లేదు..నడిచి వెళ్లినా.. ద్విచక్ర వాహనాలపై వెళ్లినా వదలకుండా కుక్కలు మీదపడి రక్కేస్తున్నాయ్. జిల్లాలో రోజుకు సరాసరి 80 నుంచి 100 మంది దాకా కుక్కకాటు బారిన పడి గాయాలపాలవుతున్నట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. పెద్ద సంఖ్యలో కుక్కలు సంచరిస్తున్నా వాటిని నియంత్రించడంలో యంత్రాంగం విఫలమవుతోంది. ఏఆర్‌వీ ఇంజక్షన్ల కొరతతో కుక్కకాటు బాధితులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలులో మాత్రమే యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఉండటంతో కుక్కల నియంత్రణ నామమాత్రంగా సాగుతోంది.
జిల్లాలో ఒక్కటే ఏబీసీ సెంటర్...
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కేవలం ఒంగోలులో మాత్రమే యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ (ఏబీసీ) ని ఏర్పాటు చేశారు. నగరంలోని మామిడి పాలెంలో ఏర్పాటు చేసిన ఏబీసీ సెంటర్‌కు జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల నుంచి కుక్కలను తరలించే సౌకర్యం కూడా లేకపోవడం గమనార్హం. తరలించినా అంత పెద్ద సంఖ్యలో కుక్కలకు శస్త్ర చికిత్సలు చేసి, వ్యాక్సినేషన్ చేసేందుకు సిబ్బంది కూడా లేరు. ఏడాది కాలంగా ఏబీసీ సెంటర్లో కేవలం 5 వేల కుక్కలకు మాత్రమే శస్త్ర చికిత్సలు చేశారు. ఈ ఏడాది మరో రెండు వేల కుక్కలను గుర్తించామని, వాటికి ఆపరేషన్లు చేయించడానికి ఏర్పాటు చేస్తున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్ కోడూరు వెంకటేశ్వర్లు చెప్పారు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉంది. జిల్లా ప్రధాన కేంద్రం నుంచి మారుమూల గ్రామాల వరకు కుక్కల బెడద లేని గ్రామం లేదు. పట్టపగలు పిల్లలను ఒంటరిగా బడికి పంపించాలన్నా, మహిళలు మార్కెట్‌కు వెళ్లాలన్నా దడుస్తున్నారు. తెల్లవారుజామున జాగింగ్ కు వెళ్లేవారి మీద తరచుగా కుక్కలు దాడి చేసి కరుస్తున్నాయి. ఇక రాత్రి పూట ఏదైనా అత్యవసర పనిపడితే బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా కుక్కలు సంచరిస్తూ ఒంటరిగా కనిపిస్తే చాలు పైనపడి రక్కేస్తున్నాయి. జిల్లా కేంద్రమైన ఒంగోలు సర్వజన ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్ వద్ద, పిల్లల వార్డు సమీపంలోనే తరచుగా కుక్కలు కనిపిస్తుండడంతో రోగులు భయపడిపోతున్నారు. కుక్కకాట్లపై సీరియస్‌గా స్పందించిన సుప్రీం కోర్టు బహిరంగ ప్రదేశాల్లో కుక్కలు కనిపించకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించింది. అయినా మున్సిపల్ అధికారులు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఒంగోలు నగరంలో ప్రతి వీధిలోనూ పెద్ద సంఖ్యలో కుక్కలు సంచరిస్తున్నా వాటిని పట్టుకొని తరలించడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.
30 వేల మందిని కరిచిన కుక్కలు...
2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు 30 వేల మందిని కుక్కలు కరిచినట్లు ప్రభుత్వ వైద్యశాలల లెక్కలను బట్టి తెలుస్తోంది. గత ఏడాది ఒక్క ఒంగోలు పరిసర ప్రాంతాల్లోనే 5843 మందిని కుక్కలు కాటు వేశాయి. కందుకూరు నియోజకవర్గంలో 2402, కనిగిరి 3598, దర్శి 2162, సంతనూతలపాడు 3577, కొండపి 3636, యర్రగొండపాలెం 1350, మార్కాపురం 2150, అద్దంకి 1590, గిద్దలూరు నియోజకవర్గంలో 2960 మందిని కుక్కలు కరిచి రక్కేశాయి. ఒంగోలు జీజీహెచ్ పరిధిలో ఈ ఏడాది జనవరిలో 603 మందిని కుక్కలు కరిచాయి. అంటే రోజుకు 82 నుంచి 100 మందిని కరుస్తున్నాయి.
5 వేల మందికి తీవ్ర గాయాలు...
కుక్కలు మీద పడి ఎక్కడ పడితే అక్కడ రక్కేయడంతో అనేక మందికి తీవ్రగాయాలవుతున్నాయి. తొడ కండలు, కాలి పిక్కలే కాకుండా ముఖం మీద కూడా రక్కేస్తున్నాయి. దీంతో సర్జరీ చేయాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. గత ఏడాది 30 వేల మందికి పైగా కుక్కలు కాటు వేయగా వారిలో సుమారు 5 వేల మందికి పైగా తీవ్రగాయాల బారినపడ్డారు. వీరికి ఎలాంటి ప్రాణాపాయం కలగకుండా ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజక్షన్లు వేసినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఒంగోలులో ఈ ఏడాది జనవరిలో కుక్కకాటుకు గురైన 603 మందిలో 105 మందికి ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజక్షన్లు వేసినట్లు తెలుస్తోంది. అలాగే గతేడాది కుక్కలు కరిచిన వారిలో కనిగిరిలో 100 మందికి పైగా ఈ ఇంజక్షన్ వేసినట్లు సమాచారం. దర్శిలో 56, సంతనూతలపాడులో 150 మందికి, కొండపిలో 729 మందికి, యర్రగొండపాలెంలో 195 మందికి, ఒంగోలులో 1633 మందికి, అద్దంకిలో 150 మందికి ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజక్షన్లు వేసినట్లు సమాచారం. వాస్తవానికి ఈ సంఖ్య రెట్టింపు ఉంటుందని వైద్య శాఖ ఉద్యోగులు చెబుతున్నారు.
లక్ష కుక్కలకు పైగా సంచారం..
జిల్లాలో ఎటు చూసినా కుక్కలే కనిపిస్తున్నాయి. ఒంగోలు నగరంలోని ఇస్లాంపేట రెండవ లైనులోని ఒక వీధిని కుక్కల బజారు అని పిలుస్తారు. ఈ వీధిలో పగలు, రాత్రి కుక్కల గుంపు తిరుగుతుంది. అంతేకాకుండా కుక్కలు ఇళ్లలోకి దూరి మంచాల కింద కూర్చుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో లక్షకు పైగా కుక్కలు ఉన్నట్లు అంచనా. ఒంగోలు, కొండపి, దర్శి ప్రాంతాల్లోనే సుమారు 50 వేలకు పైగా కుక్కలు సంచరిస్తున్నట్లు సమాచారం. ఒంగోలు పరిసరాల్లో 16 వేలకు పైగా కుక్కలు ఉన్నాయి. కేవలం నగరంలోనే 10 వేలకు పైగా కుక్కలున్నట్లు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. ఇక కొండపి, దర్శి నియోజకవర్గాలలో ఒక్కొక్కచోట 16750 కుక్కలు ఉన్నట్లు అంచనా. గిద్దలూరు పరిసరాలలో 1000, అద్దంకి పరిసరాల్లో 3500, మార్కాపురం ప్రాంతంలో 2 వేలు, యర్రగొండపాలెంలో 4 వేలు, సంతనూతలపాడులో 9500, కనిగిరిలో 10200, కందుకూరులో 3200 కుక్కలు ఉన్నట్లు అంచనా. వీధి కుక్కలతోపాటుగా పెద్ద సంఖ్యలో పెంపుడు కుక్కలున్నాయి. మొత్తం మీద లక్షకు పైగానే కుక్కలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవడంతో పాటు, కుక్కకాటు ఇంజక్షన్లు అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.
ఒంగోలు: ఉమ్మడి ప్రకాశం పరిధిలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థులకు ఈనెల 15న రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్‌చార్జి చైర్మన్ టి.రాజ్యలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు రికార్డు అసిస్టెంట్, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 2 గంటల వరకు డేటా ఎంట్రీ ఆపరేటర్, సాయంత్రం 3.30 నుంచి 5 గంటల వరకు ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టులకు రాత పరీక్ష ఉంటుందన్నారు. ఈ రాత పరీక్ష ఒంగోలు దక్షిణ బైపాస్ సమీపంలోని ఇందిరా ప్రియదర్శిని న్యాయ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు పరీక్ష సమయం కంటే గంటన్నర ముందుగా పరీక్ష కేంద్రంలో రిపోర్టు చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ఇన్‌చార్జి ప్రధాన న్యాయమూర్తి టి.రాజ్యలక్ష్మి సూచించారు.
ఒంగోలు సబర్బన్: జిల్లాలో సాగు చేసిన పొగాకు పంటను పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) బి.విశ్వశ్రీ పరిశీలించారు. ఈ మేరకు జిల్లాకు వచ్చిన ఆమె ఒంగోలు–2 పొగాకు వేలం కేంద్రం పరిధిలోని పలు గ్రామాల్లో శుక్రవారం పర్యటించారు. ప్రత్యేకంగా ఎఫ్‌సీవీ పొగాకు పొలాలను పరిశీలించారు. పేనుబంక, పొగాకు మల్లెలాంటి వ్యాధులు సోకిన పంటలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లిన ఈడీ విశ్వశ్రీ రైతులతో మాట్లాడారు. తెగుళ్ల నివారణ చర్యలు చేపట్టాలని, క్యూరింగ్, గ్రేడింగ్ చేస్తున్న సమయంలో ఉత్తమ యాజమాన్య పద్దతులు పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా ఒంగోలు–2 (త్రోవగుంట) పొగాకు వేలం కేంద్రం నిర్వహణాధికారి జే.తులసి ప్రస్తుతం సాగు చేసిన పొగాకు పంటకు సంబంధించి పలు గ్రామాల్లో ఉన్న పరిస్థితులను వివరించారు. ఈడీ వెంట పొగాకు ఆక్షన్స్ మేనేజర్ రామాంజనేయులు, ఆర్‌ఎం ఎస్.రామారావుతో పాటు పలువురు అధికారులు ఉన్నారు.


