సర్పంచ్‌లను వేధించడం తగదు
ఒంగోలు టౌన్: చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా ఆరు నెలలుగా సర్పంచ్‌లను వేధింపులకు గురిచేస్తున్నారని, ఇది మంచిపద్ధతి కాదని సర్పంచ్‌ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జి.వీరభద్రాచారి అన్నారు. ఈమనిపాలెంలోని సంఘ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, రాచర్ల, పెదారవీడు, తర్లుపాడు, మార్కాపురం, యర్రగొండపాలెం మండలాల్లోని పంచాయతీ కార్యదర్శులు, మండల అభివృద్ధి అధికారులు, డిప్యూటీ ఎంపీడీఓలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సర్పంచ్‌లకు బిల్లులు రాకుండా చేయడంలో ఎమ్మెల్యేల ప్రమేయం ఉన్నట్లు వస్తున్న కథనాలు సిగ్గుచేటన్నారు. బిల్లులు చెల్లించాలని అడిగిన సర్పంచ్‌లపై పోలీసు కేసులు పెట్టి వేధిస్తున్న తీరు దుర్మార్గమన్నారు. కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో గిద్దలూరు మండలం ఏఆర్ పల్లి సర్పంచ్ రామచంద్రయ్య పాల్గొన్నారు.


