నేడు పోలీసు స్పందన రద్దు
ఒంగోలు టౌన్: జిల్లా పోలీసుల వార్షిక నేర సమీక్ష సమావేశం సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎస్పీ హర్షవర్థన్‌రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, దూర ప్రాంతాల నుంచి అనేక వ్యయప్రయాసాలకోర్చి ఒంగోలుకు రావద్దని కోరారు.
ఒంగోలు వన్‌టౌన్: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘ జిల్లా వార్షిక సర్వసభ్య సమావేశం ఈ నెల 29న ఒంగోలు ఏపీ ఎన్‌జీఓ హోంలో నిర్వహించనున్నట్లు సంఘ ప్రకాశం జిల్లా విభాగం ప్రధాన కార్యదర్శి కె.సుబ్బారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందన్నారు.
కొమరోలు: రాష్ట్రస్థాయిలో నిర్వహించిన పరుగు పందెం పోటీల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి 3వ స్థానంలో నిలిచాడు. కొమరోలు మండలం నల్లగుంట్ల గ్రామానికి చెందిన షేక్ నాయబ్‌రసూల్ రాజమండ్రిలో జరిగిన అండర్–16 నేషనల్ లెవల్ కాంపిటేషన్‌లో 100 మీటర్ల పరుగు పందెంలో 3వ స్థానంలో నిలిచాడు. త్వరలో జార్ఖండ్‌లో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈసందర్భంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, ప్రముఖులు నాయబ్‌రసూల్‌ను అభినందించారు.
● ఒకరి పరిస్థితి విషమం
అర్ధవీడు: బోలేరో వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే గన్నెపల్లి గ్రామానికి చెందిన షేక్ రసూల్, షేక్ కాశీంలు ద్విచక్రవాహనంపై వెళుతుండగా కంభం వైపు వెళుతున్న బోలేరో వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలుకు తరలించారు. అర్ధవీడు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఒంగోలు టౌన్: గ్రామీణ ప్రాంతాల నుంచి జీవనోపాధి కోసం పట్టణాలకు వచ్చి అపార్ట్‌మెంట్ వాచ్‌మన్లుగా పనిచేస్తున్న వారికి ప్రభుత్వం తగిన భద్రత కల్పించాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్ మోహన్ డిమాండ్ చేశారు. నగరంలోని మాదాల నారాయణ స్వామి భవనంలో ఆదివారం ప్రకాశం జిల్లా అపార్ట్‌మెంట్ వాచ్‌మన్ల సంక్షేమ సంఘం ఆవిర్భావ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ...గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో అనేక మంది రైతు కూలీలు నగరాలకు వలస వచ్చి వాచ్‌మన్లుగా బతుకుతున్నారని చెప్పారు. ప్రభుత్వ సహాయ సహకారాలు లేకుండా అనుక్షణం అభద్రత మధ్య బతుకు వెళ్లదీస్తున్నారని చెప్పారు. అపార్ట్‌మెంట్ వాచ్‌మన్లకు కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేసి అభివృద్ధికి అండగా నిలబడాలన్నారు. పక్కా గృహాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సీఎస్ సాగర్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని, 44 లేబర్ కోడ్లను రద్దు చేయడం వల్ల కార్మికుల జీవన విధానం దెబ్బతింటుందన్నారు. భవన నిర్మాణ కార్మికులకు చెల్లించాల్సిన నిధులను ఇతర రంగాలకు మళ్లించి కార్మికులను మోసం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్యపోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
నూతన కార్యవర్గం ఎంపిక...
జిల్లా అపార్ట్‌మెంట్ వాచ్‌మన్ల సంక్షేమ సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం జిల్లా అధ్యక్షునిగా టి.రామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా జీవీ నరసింహారావులతో పాటు 13 మంది సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో కాశయ్య, వెంకటరమణ, సుబ్బయ్య, సీహెచ్ వీరయ్య, చెలంచర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
నేడు పోలీసు స్పందన రద్దు
నేడు పోలీసు స్పందన రద్దు


