ప్రమాదవశాత్తు గుంతలో పడి లైన్‌మన్ మృతి
యర్రగొండపాలెం: ప్రమాదవశాత్తు గుంతలో పడి విద్యుత్ లైన్‌మన్ మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..పుల్లలచెరువు విద్యుత్ లైన్‌మన్‌గా విధులు నిర్వర్తిస్తున్న శివ నాయక్(40) మార్కాపురంలో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 24వ తేదీ మోటారుబైక్‌పై మార్కాపురం నుంచి యర్రగొండపాలెం బయలుదేరాడు. అయితే డ్యూటీకి వెళ్లలేదు, తిరిగి ఇంటికీ రాలేదు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు మార్కాపురంలో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో మార్కాపురం రోడ్డులోని పాలకేంద్రానికి సమీపంలో ఉన్న గోళ్లవిడిపి అడ్డరోడ్డు వద్ద ఫైబర్ కేబుల్ కోసం తీసిన గుంతలో బైక్‌తో పాటు అతను శవమై పడి ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ముందుగా గుర్తుతెలియని శవంగా గుర్తించారు. మృతుడి వద్ద ఉన్న వివరాల ప్రకారం అదృశ్యమైన శివనాయక్‌గా నిర్ధారణకు వచ్చారు. మార్కాపురం నుంచి బయలుదేరిన ఆయన ప్రమాదవశాత్తు గుంతలో పడి మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి.చౌడయ్య తెలిపారు.
ప్రమాదవశాత్తు గుంతలో పడి లైన్‌మన్ మృతి


