చనిపోయిన వారి ఓట్లు తొలగించాలి
ఒంగోలు సబర్బన్: జిల్లాలో చనిపోయిన వారి ఓట్లు గుర్తించి అధికారులు తొలగించాలని డీఆర్‌ఓ బీసీ హెచ్ ఓబులేసు సూచించారు. ఈ మేరకు శనివారం ఒంగోలు కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ మాట్లాడుతూ జిల్లా అధికారులు వెంటనే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో చనిపోయిన వారి ఓట్లను గుర్తించి వెంటనే వారి ఓట్లను తొలగించాలని అధికారులను ఆదేశించారు. వెంటనే అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్ లెవల్ ఏజెంట్లను రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకోవాలని, రెండేసి ఓట్లు కలిగిన వారు వెంటనే రెండో ఓటును రద్దు చేసుకుని, మీరు నివాసం ఉన్న చోట మాత్రమే ఓటును కలిగి ఉండాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఓటుకు ఆధార్ అనుసంధానం చేసుకో ని వారు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని కోరా రు, 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులు తమ ఓట్లు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు దామరాజు క్రాంతికుమార్ మాట్లాడుతూ ప్రతి పౌరుడు ఒక్క ఓటు మాత్రమే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రెండో ఓటు కలిగిన వారిని గుర్తించి వారి ఓటును ఓటర్ లిస్టు నుంచి తొలగించాలని కోరారు. జిల్లాలో చనిపోయిన వారి ఓట్లు తొలగించాలని, అధికారులు దానిమీద దృష్టి పెట్టాలని క్రాంతికుమార్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, కనిగిరి ఆర్‌డీఓ కేశవర్ధన్ రెడ్డి, ఏఈఆర్‌ఓ మంజునాథ్ రెడ్డి, కుమార్, జాన్సన్, బ్రహ్మయ్య, జిల్లా ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఒంగోలు తహసీ ల్దార్ పిన్నిక మధుసూదన్, పొలిటికల్ పార్టీల ప్రతినిధులు వైఎస్సార్‌సీపీ తరఫున దామరాజు క్రాంతికుమార్, జిల్లా ఎలక్షన్ సెల్ సీపీఎం రఘురామ్, జనసేన రమేష్, జిల్లా ఎలక్షన్ ఆఫీస్ నుంచి ఉపేంద్ర, రాజశేఖర్ రెడ్డి, ఒంగోలు నుంచి ఈఈలు, సలోమి పాల్గొన్నారు.


