ఉపాధి కరువై.. ఊరు బరువై..! | - | Sakshi
Sakshi News home page

ఉపాధి కరువై.. ఊరు బరువై..!

Dec 23 2025 6:55 AM | Updated on Dec 23 2025 6:55 AM

ఉపాధి కరువై.. ఊరు బరువై..!

ఉపాధి కరువై.. ఊరు బరువై..!

ఉపాధి హామీ చట్టం మార్పులతో జిల్లాపై తీవ్ర ప్రభావం ఇప్పటికే జిల్లాలో పొట్టకూటి కోసం ఏడాదికి లక్ష మంది వలసలు ఉపాధికి గండిపడితే మరో లక్షకు పైగా వలసల బాట తప్పదు ఇప్పటికే 50 వేల కార్డులను తొలగించిన చంద్రబాబు ప్రభుత్వం జిల్లాలో ప్రస్తుతం 3.6 లక్షల కార్డులు రూ.70 కోట్ల బిల్లుల బకాయిలు నాలుగు నెలల వేతనాలు రూ.70 లక్షలు పెండింగ్‌ ఉపాధి పథకం భవిష్యత్‌పై గ్రామీణుల్లో ఆందోళన

గ్రామీణ పేదలకు జీవనోపాధి భద్రత, వలసల తగ్గింపు, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి సాధన అనే లక్ష్యంతో అమలవుతోంది ఉపాధి హామీ పథకం. తాజాగా కేంద్రం తీసుకొచ్చిన నిబంధనలు పేదల బతుకులకు అవరోధంగా మారనున్నాయి. ఉపాధి కరువై వారు వలస బాట పట్టే పరిస్థితులు ఉత్పన్నం కానున్నాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథక లక్ష్యానికి తూట్లు పొడుస్తూ వచ్చింది. తొలిరోజు నుంచే రాజకీయ కారణాలతో ఉపాధి పనులను దెబ్బ తీసింది. రకరకాల సాకులు చెబుతూ జిల్లాలో ఉపాధి జాబ్‌ కార్డుల్లో భారీగా కోతలు పెట్టింది. అరకొర పనులు.. ఆపై బిల్లుల చెల్లింపులో ముప్పు తిప్పలు పెట్టడం వెరసి ఉపాధి కూలీలు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. ఇప్పటికే లక్ష మందికిపైగా వలస బాట పట్టగా, రానున్న రోజుల్లో మరో లక్షమంది జిల్లా వదలిపోయే ప్రమాదం ఉంది.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఉపాధి హామీ పథకానికి మంగళం పాడేందుకు పాడె సిద్ధమైంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉపాధి కూలీలకు కష్టాలు మొదలయ్యాయి. జిల్లాలో తొలుత ఫీల్డ్‌ అసిస్టెంట్ల చేత రాజీనామాలు చేయించడంతో తొలి ఏడాది పనులు ఆగిపోయాయి. రెండో ఏడాది నుంచి రకరకాల సాకులు చెబుతూ జిల్లాలో జాబ్‌ కార్డుల్లో భారీగా కోతలు పెట్టింది. దానికి తోడు అరకొర పనులు చేయిస్తున్నా బిల్లులను సకాలంలో మంజూరు చేయకుండా ఉపాధి కూలీలను ముప్పుతిప్పలు పెట్టడం మొదలు పెట్టారు. కోట్లాది రూపాయల వేతనాలు ఇవ్వకపోవడంతో ఉపాధి కూలి పనుల కోసం ఇతరత్రా దారులు వెదుక్కోవడం తప్పడంలేదు. తాజాగా కేంద్రం తీసుకొచ్చిన మార్పుతో పథకం నిర్వీర్యం కానుందని గ్రామీణ ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. జిల్లాలో 4.1 లక్షల జాబ్‌కార్డులు ఉండగా 50 వేల కార్డులను తొలగించడంతో 3.6 లక్షల కార్డులు మిగిలాయి. ఉపాధి హామీ నిబంధనల ప్రకారం ఒక్కొక్క కుటుంబానికి ఏడాదికి 100 రోజులు పని కల్పించాల్సి ఉంది. ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం పనిదినాలకు 125 రోజులకు పెంచింది. నిజానికి జిల్లాలో 50 రోజుల పనులు కూడా జరగడం లేదని ఉపాధి కూలీలు ఆరోపిస్తున్నారు. గత ఏడాది 10,407 మంది వంద రోజుల పాటు పనులు చేయగా, ఈ ఏడాది కేవలం 1166 మంది మాత్రమే పనులు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దీనిని బట్టి జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులు ఏ విధంగా సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

మార్పులతో చిక్కులే..

ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకంలో చేసే ఖర్చుల్లో 90 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుండగా 10 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇక నుంచి దీనిని 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రం భరించేలా మార్పులు చేశారు. రాష్ట్ర వాటా డిపాజిట్‌ చేసిన తరువాతనే కేంద్రం తన వంతు వాటా విడుదల చేస్తుందని షరతు విధించారు. అసలే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని కొండెక్కి కూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటా ఖర్చుచేయడం అనుమానమేనని ప్రజా సంఘాల నాయకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధిలో భాగంగా చేసే పనులను గ్రామ సభలు నిర్వహించడం ద్వారా ఎంపిక చేసేవారు. దానికి బదులుగా ఏఏ పనులు చేయాలో ఇక కేంద్రమే నేరుగా నిర్ణయిస్తుంది. దీని వలన అవసరమైన పనులు జరిగే అవకాశం ఉండకపోవచ్చని అధికారులు చెబుతున్నారు.

మరో లక్ష మంది వలస బాట తప్పదా...

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామాల్లో వలసలు పెరిగిపోయాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అటకెక్కడం, ప్రభుత్వం సాయం చేయకుండా ఒట్టిమాటలతో కాలం గడుపుతుండడంతో కుటుంబ పోషణ కోసం గ్రామీణ ప్రజలు వలస బాట పట్టారు. మార్చి నుంచి అక్టోబర్‌ వరకు జిల్లాలో ఏడాదికి లక్ష మంది వలసపోయినట్లు అంచనాలు ఉన్నాయి. ఎక్కువగా పశ్చిమ ప్రకాశం జిల్లా నుంచే వలసలు వెళుతున్నారని తెలుస్తోంది. మార్కాపురం పరిసర ప్రాంతాల నుంచి గుంటూరు, కర్నూలు ప్రాంతాలకు పత్తి తీయడానికి, మిర్చి కోతలకు వెళుతున్నట్లు సమాచారం. చెరుకు కోతలకు గాను యర్రగొండపాలెం పరిసర ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం వైపునకు కొందరు, రాయలసీమలోని చిత్తూరు ప్రాంతాలకు మరికొందరు వెళుతున్నట్లు తెలిసింది. జిల్లాలోని కనిగిరి, గిద్దలూరు పరిసర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌, చైన్నె, బెంగళూరు తదితర నగరాల్లో భవన నిర్మాణ కార్మికులుగా పనులకు వెళుతున్నారు. ఇప్పుడు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులతో ఉపాధి పథకం పూర్తిగా నిర్వీర్యం అవడం ఖాయమని వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు ఆందోళన చెందుతున్నారు. కొత్త నిబంధనలు ప్రకారం చూస్తే మరో లక్ష మందికి పైగా జీవనోపాధిని వెదుక్కుంటూ వలసబాట పట్టే అవకాశం ఎక్కువగా ఉందన్న ఆందోళన గ్రామీణ ప్రాంతాల పేద ప్రజల్లో వ్యక్తమవుతోంది.

నాలుగు నెలలుగా వేతనాలు లేవు...

జిల్లాలో ఉపాధి వేతనాల బకాయిలు కొండలా పేరుకొని పోతున్నాయి. పనిచేసిన తర్వాత నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోవడంతో ఉపాధి కూలీలు నిరాశకు గురౌతున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 4వ తేదీ వరకు చేసిన పనులకు వేతనాలు మంజూరయ్యాయి. ఆ తరువాత నేటి వరకు అంటే నాలుగు నెలల వేతనాలు మంజూరు కాలేదు. దీని తాలుకు రూ.78 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. అంతేకాకుండా సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, గోకులం షెడ్లు, నీటి తొట్ల నిర్మాణాలతోపాటుగా హార్టీకల్చర్‌ కింద పండ్ల తోటలు సాగు చేస్తున్న రైతులకు సైతం బిల్లులు మంజూరు కాలేదు. సుమారు రూ.70 కోట్లకు పైగానే బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇప్పడు ఉపాధి హామీ పథకంలో చేసిన మార్పుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం ఖర్చు భరించాల్సి ఉంటుంది. ఈ లెక్కన పెండింగ్‌ బిల్లులు ఎప్పటికొస్తాయో చెప్పలేని పరిస్థితి నెలకొందని అధికారులు నొసలు విరుస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement