అంగన్‌వాడీ ఆయాకు విద్యుత్‌ రాయితీ రాదట! | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ ఆయాకు విద్యుత్‌ రాయితీ రాదట!

Dec 23 2025 6:55 AM | Updated on Dec 23 2025 6:55 AM

అంగన్‌వాడీ ఆయాకు విద్యుత్‌ రాయితీ రాదట!

అంగన్‌వాడీ ఆయాకు విద్యుత్‌ రాయితీ రాదట!

అంగన్‌వాడీ ఆయాకు విద్యుత్‌ రాయితీ రాదట!

ఎస్‌సీ కోటాలో 200 యూనిట్ల ఉచిత పథకం మాయం కలెక్టర్‌ గ్రీవెన్స్‌లో బాధితుల ఫిర్యాదు గ్రీవెన్స్‌కు పోటెత్తిన అర్జీదారులు

ఒంగోలు సబర్బన్‌: అంగన్‌వాడీ ఆయా..వచ్చేది గౌరవ వేతనం నెలకు రూ.7 వేలు మాత్రమే. ఆమెకు ఆ నగదు వేసేది సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారానే. దీంతో ఆమెకు ఎస్‌సీ కోటాలో రావాల్సిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎత్తేసింది. దీనిపై బాధితులు కలెక్టర్‌ను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే సోమవారం కలెక్టర్‌ రాజాబాబు నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో టంగుటూరు మండలం ఎం.నిడమనూరుకు చెందిన అంగన్‌వాడీ ఆయా తాటితోటి శిరీష భర్త పిడుగురాళ్ల సురేష్‌ బాబు నిరుపేదనైన, ఎస్‌సీ సామాజికవర్గానికి చెందిన తన కుటుంబానికి రావల్సిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకం రద్దు చేశారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తన భార్య అంగన్‌వాడీ ఆయా అని, తనకు నెలకు రూ.7 వేలు మాత్రమే గౌరవ వేతనం వస్తుందని, కానీ విద్యుత్‌ అధికారులు మాత్రం తన భార్య శిరీష అంగన్‌వాడీ కార్యకర్త(టీచర్‌) అని నెలకు రూ.12 వేలు వస్తుందని రాశారన్నారు. ఆయా ఉద్యోగం చేస్తుంటే టీచర్‌ ఉద్యోగం చేస్తుందని రాయటంతో ఉచిత విద్యుత్‌ పథకానికి రావాల్సి రాయితీ రాకుండా విద్యుత్‌ అధికారులు, సిబ్బంది చేశారని కలెక్టర్‌ ముందు వాపోయాడు. దాంతో కలెక్టర్‌ రాజాబాబు ఏపీసీపీడీసీఎల్‌ ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లును పిలిపించారు. ఉచిత విద్యుత్‌ పథకం నష్టపోవటానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆ కుటుంబానికి తెల్ల రేషన్‌కార్డు ఉంది. పిల్లలకు తల్లికి వందనం వస్తుంది. కానీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకం మాత్రం చంద్రబాబు ప్రభుత్వం ఎత్తేసింది. దాంతో చివరకు సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా గౌరవ వేతనం పడుతుంది కాబట్టి ఉచిత విద్యుత్‌ పథకం పోయిందని తేల్చారు. అందుకు సంబంధించిన విధివిధానాలపై ప్రభుత్వానికి నివేదిక పంపుదామని, పూర్తి వివరాలు ఒక రిపోర్టు రూపంలో తనకు పంపాలని విద్యుత్‌ ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లుకు కలెక్టర్‌ రాజాబాబు సూచించారు.

అర్జీలను వెంటనే పరిష్కరించాలి:

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలకు నాణ్యతతో కూడిన సత్వర పరిష్కారాన్ని అందించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్‌ రాజాబాబు ఆదేశించారు. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో కలెక్టర్‌ రాజాబాబు వచ్చిన అర్జీలను నిశితంగా పరిశీలించారు. మొత్తం 268 వినతులను కలెక్టర్‌ పరిశీలించారు. వచ్చిన అర్జీలను ఆయాశాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్‌ రెడ్డి, కుమార్‌, జాన్సన్‌, కళావతి, విజయజ్యోతి, డీపీఓ ముప్పూరి వెంకటేశ్వరరావులతో కలసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.

నిధులు విడుదల చేయాలని కలెక్టర్‌కు

సర్పంచుల వినతి

గిద్దలూరు రూరల్‌: మండలంలోని గ్రామ పంచాయతీల్లో పలు అభివృద్ధి పనులకు సంబంధించిన నిధుల విడుదల కోసం సర్పంచులు సోమవారం ఒంగోలులోని పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో కలెక్టర్‌ రాజాబాబును కలిసి వినతి పత్రం అందజేశారు. గిద్దలూరు మండలంలోని గ్రామ సర్పంచులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు మంజూరు చేయడంలో ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. తమ గ్రామ పంచాయతీలో వివిధ అభివృద్ధి పనుల కోసం గత 6 నెలలుగా ఖర్చు చేసిన నిధుల బిల్లులు ప్రభుత్వం నుంచి విడుదల కాలేదని వాపోయారు. ఒక్కో గ్రామ పంచాయతీలో సుమారు రూ.5 లక్షల మేర నిధులు ప్రభుత్వం నుంచి విడుదల కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల సర్పంచులు బయట అప్పులు చేసి మరీ ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అర్జీ ఇచ్చిన వారిలో సర్పంచులు ఏరువ రాజశేఖరరెడ్డి, అంజినాయక్‌, బండి శ్రీనివాసులు, భూదేవి, లక్ష్మీ ప్రసన్న, సమాధుల రాజేశ్వరి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement