రాజకీయ కుట్రతోనే పేరు మార్పు
● ఉపాధి హామీ చట్టంలో మార్పులను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన
ఒంగోలు టౌన్: రాజకీయ కుట్రతోనే ఉపాధి హామీ పథకం చట్టంలో మహాత్మాగాంధీ పేరు తొలగించారని, దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఎలాంటి పాత్ర పోషించని బీజేపీ.. చరిత్రను మసిపూసి మారేడుకాయ చేసేందుకు కుయుక్తులకు పాల్పడుతోందని వామపక్ష పార్టీల నాయకులు ధ్వజమెత్తారు. మహాత్మా గాంధీ పేరు తొలగించి జీ రాం జీ పేరు పెట్టిన మోదీ సర్కార్ ఉపాధి చట్టాన్ని కుదించి ఒక స్కీంలాగా మార్చివేయడం ప్రజలను దగా చేయడమేనని మండిపడ్డారు. ఉపాధి హామీ చట్టంలో మార్పులకు నిరసనగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆర్.వెంకటరావు అధ్యక్షత వహించగా, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి నిరంతరం కుట్రలు చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. ప్రతి బడ్జెట్లోనూ ఉపాధి చట్టానికి నిధుల కోత విధిస్తూ వచ్చారని చెప్పారు. గ్రామీణ నిరుపేద ప్రజలకు పని చూపించడం, లేనిపక్షంలో తిండి పెట్టేందుకు చొరవ చూపడమే ఉపాధి హామీ పథకం లక్ష్యమని తెలిపారు. వామపక్ష పార్టీల ఒత్తిడి మేరకు యూపీఏ తీసుకొచ్చిన ఈ పథకంతో గ్రామీణ ప్రాంతాల రూపరేఖలు మారాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం నిధులను భరించాలనడమే కాకుండా తన వాటాను ముందుగానే డిపాజిట్ చేయాలనడం దుర్మార్గమన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్‌కే మాబు మాట్లాడుతూ ఉపాధి పథకం అమలైనప్పటి నుంచి నేటి వరకు దేశంలో రూ.9 లక్షల కోట్ల పనులు జరిగాయని తెలిపారు. దీనివలన గ్రామీణ ప్రాంతాలలో ఎన్‌ఎస్పీ చెరువులు, రోడ్లు, కుంటలు అభివృద్ధి చెందాయని, గ్రామీణ ప్రజల జీవితాలలో ఎంతోకొంత మార్పు తీసుకొచ్చిందని అన్నారు. వలసలు తగ్గాయని, పనులు లేని సమయంలో చిన్న, సన్నకారు రైతులు ఉపాధి పనులకు వెళ్లారని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు రైతులు, కూలీల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. నిరసన కార్యక్రమంలో సీపీఐ న్యూ డెమెక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సంయుక్త కిసాన్ జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు, శ్రీరాం శ్రీనివాసరావు, సయ్యద్ మౌలాలి, ఎంఏ సాలార్, జూపల్లి కోటేశ్వరరావు, నల్లూరి మురళి, కొత్తకోట వెంకటేశ్వర్లు, దాసరి అంజయ్య, బాలాజీరెడ్డి, లలిత కుమారి, ఎల్.రాజశేఖర్, కంకణాల ఆంజనేయులు, పమిడి వెంకటరావు, జీపీ రామారావు, ఎం.విజయ తదితరులు పాల్గొన్నారు.


