అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న అధికారులు
● మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్
సింగరాయకొండ: చంద్రబాబు ప్రభుత్వంలో అధికారులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ విమర్శించారు. సింగరాయకొండ పార్టీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ సురేష్ మాట్లాడుతూ మీది రెడ్‌బుక్ అయితే మాది డిజిటల్ బుక్ అన్నారు. చివరికి జగనన్న పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటానికి కూడా ఆంక్షలు విధిస్తున్నారన్నారు. పోలీసులు ఫోన్ చేసి కందుకూరు రోడ్డు సెంటర్లో కాదు శానంపూడి రోడ్డులోని ఆర్చి వద్ద వేడుకలు జరుపుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారని, చివరకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా వెంటనే తొలగించాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనటం మంచి పరిణామమన్నారు. 2027వ సంవత్సరంలో ముందస్తు జమిలి ఎన్నికలు తథ్యమని అన్నారు. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో డీ లిమిటేషన్ ఉండదని, నియోజకవర్గాల పునర్విభజన జరగదన్నారు. 2026వ సంవత్సరంలో జనగణన పూర్తి కాగానే మోదీ ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమవుతుందని వివరించారు.
ఒంగోలు: ఉపాధ్యాయుల క్రీడాపోటీలు స్థానిక మినీ స్టేడియంలో సోమవారం ఉత్సాహంగా నిర్వహించారు. జిల్లా స్థాయి క్రీడాపోటీల్లో భాగంగా పురుషులకు క్రికెట్, మహిళలకు త్రోబాల్ పోటీలు నిర్వహించారు. క్రికెట్ విజేతగా మార్కాపురం డివిజన్, రన్నర్స్‌గా కనిగిరి డివిజన్ జట్లు నిలిచాయి. త్రోబాల్ విన్నర్స్‌గా కనిగిరి డివిజన్, రన్నర్స్‌గా ఒంగోలు డివిజన్ జట్లు నిలిచాయి. ఈ సందర్భంగా వారికి జిల్లా విద్యాశాఖ అధికారి సీవీ రేణుక మెడల్స్ అందించి అభినందించారు. జనవరిలో రాష్ట్రస్థాయిలో జరిగే పోటీల్లో కూడా రాణించి ప్రకాశం జిల్లా ఖ్యాతిని రాష్ట్రస్థాయిలో ఇనుమడింపజేయాలని ఆమె కోరారు. క్రీడా పోటీలను ఉప విద్యాశాఖ అధికారి చంద్ర మౌళీశ్వరరావు, మండల విద్యాశాఖ అధికారులు టి.కిషోర్‌బాబు, తన్నీరు బాలాజీ, కె.శ్రీనివాసరావులతోపాటు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి డాక్టర్ చెక్కా వెంకటేశ్వర్లు, ఎ.శిరీషాకుమారి పర్యవేక్షించారు.
● జిల్లా అధికారులను ఆదేశించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ
ఒంగోలు సబర్బన్: జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల్లోని మూడు జిల్లాల్లో కూడా బ్లాక్ బర్లీ పొగాకు రైతులు ఎవరూ సాగు చేయవద్దని రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం అమరావతి నుంచి స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆధ్వర్వంలో డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, టొబాకో బోర్డు, టొబాకో అసోసియేషన్, వివిధ కంపెనీ అధికారులు, మార్క్‌ఫెడ్ హెడ్ ఆఫీసు డిస్ట్రిక్ట్ మేనేజర్స్, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాశం, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్స్, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్స్‌తో టొబాకో బ్లాక్ బర్లీ, వైట్ బర్లీ సాగు వివరాలపై చర్చించారు. బ్లాక్ బర్లీ ఎవరూ సాగు చేయటానికి వీలులేదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తేల్చి చెప్పారు. వైట్‌బర్లీ సాగు చేసే రైతులు కంపెనీ వారి దగ్గర ఎంఓయూ కుదుర్చుకొని మాత్రమే సాగు చేయాలని సూచించారు. అదే విధంగా వైట్‌బర్లీ సాగు వివరాలను కంపెనీ వారు రైతు వారీగా వ్యవసాయాధికారులకు జాబితా పంపాలని సూచించారు. సమావేశంలో ఒంగోలు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ రాజాబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


