జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక
టంగుటూరు: ఈ నెల 16, 17, 18 తేదీల్లో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 69వ రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్ వాలీబాల్ అండర్ 14 బాలికల విభాగంలో ప్రకాశం జిల్లా జట్టు రన్నర్స్ గా నిలిచింది. ఈ పోటీల్లో మండలంలోని ఆలకూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సుదర్శి కుందన, వరికూటి వందన, కడియం జెస్సిక లు అత్యుత్తమ ప్రతిభ చూపారని వీరిలో కడియం జెస్సిక, వరికూటి వందన జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయుడు వాకా వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. ఎంపికై న విద్యార్థులు కడప జిల్లాలో జనవరి 6 నుంచి 10 వరకు జరిగే జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలీబాల్ జట్టు తరఫున పాల్గొంటారని పాఠశాల పీడీ పి.వెంకట్రావు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించిన విద్యార్థినులను టంగుటూరు మండల ఎంఈఓ 1,2 ఆనందరావు, బాలాజీ, ఉపాధ్యాయులు అన్నపూర్ణ, రాజ సులోచన, నిర్మల, చెన్నయ్య, విజయలక్ష్మి, అరుణకుమారి, సుబ్బారావు, భూషణ్ రెడ్డి, సుభాషిణి అభినందనలు తెలిపారు.
● జిల్లా ఖజానా శాఖ అధికారి ఏ.జగన్నాథరావు
ఒంగోలు సబర్బన్: ప్రభుత్వ పింఛనుదారుల నుంచి 2026 సంవత్సరానికి సంబంధించి యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ల(ఏవీసీ)ను సమర్పించాలని జిల్లా ఖజానా, లెక్కల శాఖ అధికారి ఎ.జగన్నాథరావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ప్రభుత్వం పింఛనుదారుల నుంచి ఏవీసీ సర్టిఫికెట్లను జిల్లాలోని అన్ని ఖజానా కార్యాలయాలతో పాటు పోస్టాఫీసు, మీ సేవా, నెట్ సెంటర్స్‌లో ద్వారా కూడా పంపించవచ్చన్నారు. ఈ ఏవీసీ సర్టిఫికెట్లు జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు స్వీకరించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. జిల్లాలోని ఒంగోలు, పొదిలి, దర్శి, కనిగిరి, కంభం, గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం తదితర సబ్ ట్రెజరీల పరిధిలో సర్వీస్ పింఛను డ్రా చేసే పెన్షన్‌దారులు లైఫ్ సర్టిఫికెట్, నాన్ ఎంప్లాయిమెంట్ సర్టిఫికెట్లను సమర్పించాలన్నారు. అదేవిధంగా ఫ్యామిలీ పెన్షన్ డ్రా చేసే పెన్షన్‌దారులు లైఫ్ సర్టిఫికెట్, నాన్ ఎంప్లాయిమెంట్ సర్టిఫికెట్‌లతో పాటు అదనంగా నాన్–రీ మ్యారేజ్ సర్టిఫికెట్లను సమర్పించి వారి పెన్షన్ చెల్లింపులను క్రమబద్ధీకరించుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఆర్థిక శాఖ సర్క్యులర్ ప్రకారం పింఛనుదారులకు మెరుగైన వసతులను కల్పించాలన్న సంకల్పంతో ప్రభుత్వం డిజిటల్ ఏవీసీల విధానాన్ని ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. నిర్ణీత కాల వ్యవధిలో యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికెట్లను సమర్పించని పింఛనుదారుల నెలవారీ పింఛనును మార్చి 2026 నుంచి నిలుపుదల చేస్తారన్నారు.
● పంచాయతీ కార్యదర్శులకు, డిప్యూటీ ఎంపీడీఓలకు జారీ చేసిన ప్రభుత్వం
● జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు
ఒంగోలు సబర్బన్: జిల్లాలోని పలు గ్రామాల్లో కేవలం ఒక శాతం మాత్రమే ఇంటి పన్నులు వసూలు చేసిన పంచాయతీల కార్యదర్శులు, డిప్యూటీ ఎంపీడీఓలకు రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల వివరాలను జిల్లా పంచాయతీ అధికారి ముప్పూరి వెంకటేశ్వరరావు శుక్రవారం వెల్లడించారు. అన్ని పంచాయతీల్లో ఇంటి పన్ను పాత బకాయిలు సక్రమంగా వసూలు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత డివిజినల్ పంచాయతీ అధికారులకు తగిన సూచనలు ఇవ్వాలని, వారి పరిధిలోని డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారని గుర్తు చేశారు. మీ పరిధిలోని పంచాయతీల ఇంటి పన్ను వసూళ్లపై పర్యవేక్షణ చేయనందుకు మీపై ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోకూడదో ఈ షోకాజ్ నోటీసు అందిన 3 రోజుల్లోగా రాతపూర్వకంగా డీపీఓ ముందు హాజరై సంజాయిషీ సమర్పించాలని ఆదేశించారు. ఒక శాతం మాత్రమే ఇంటి పన్నులు వసూలైన గ్రామాల్లో పుల్లలచెరువు మండలం మర్రివేముల, ముటుకుల, ఐటీవరం, గంగవరం, అర్ధవీడు మండలం వెలగలపాయ, గన్నేపల్లి, బోగోలు, పొదిలి మండలం మల్లవరం, మార్కాపురం మండలం బోడపాడు, భూపతిపల్లి, ముండ్లమూరు మండలం శంకరాపురం, భీమవరం, దొనకొండ మండలం పోలేపల్లి, సీఎస్‌పురం మండలం కోవిలంపాడు, తాళ్లూరు మండలం తురకపాలెం, దోసకాయలపాడు, పొన్నలూరు మండలం చౌటపాలెం ఉన్నాయి.


