ఇంటర్మీడియెట్ సంస్కరణలపై అవగాహన
ఒంగోలు సిటీ: ఇంటర్మీడియెట్ విద్యలో ఈ విద్యా సంవత్సరం ప్రారంభించిన సంస్కరణల అమలులో కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు ప్రత్యేకించి పబ్లిక్ పరీక్షల నిర్వహణాధికారులు అవగాహన పెంచుకొని అప్రమత్తంగా ఉండాలని ఇంటర్ విద్య ఆర్‌జేడీ జె.పద్మ సూచించారు. ఇంటర్మీడియెట్ విద్యామండలి ఆధ్వర్యంలో ఒంగోలు ఏకేవీకే జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షల్లో భాగస్వాములయ్యే అధికారుల కోసం శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఇంటర్ బోర్డ్ ఓఎస్‌డీ (అకడమిక్), సదస్సు రిసోర్సు పర్సన్ వీవీ సుబ్బారావు సంస్కరణల అమలు గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పదో తరగతి వరకు ఎన్‌సీఈ ఆర్‌టీ సిలబస్, ఆంగ్ల మాధ్యమం అమలైన నేపథ్యంలో జాతీయ విద్యా విధానం దృష్ట్యా ఈ ఏడాది ఇంటర్ విద్యలో సిలబస్ మార్పు, పరీక్షల సంస్కరణలను అమలు చేశారన్నారు. ప్రశ్న పత్ర స్వరూపం, మార్కుల విభజన, ఆన్సర్ బుక్‌లెట్ల పేజీల పెంపు గురించి వివరించారు. మొదటి సంవత్సరం ఎంపీసీ విద్యార్థులు బయాలజీని, బైపీసీ విద్యార్థులు మ్యాథ్స్ సబ్జెక్టును అదనపు సబ్జెక్టుగా చదివే అవకాశం కల్పించారని, అదనపు సబ్జెక్టులో పాసైనా, ఫెయిలైనా ఇంటర్మీడియెట్ పాస్ సరిఫికెట్లో చూపరని, దాని కోసం ప్రత్యేకంగా మార్క్స్ మెమో ఉంటుందని గమనించాలన్నారు. గతంలో ఉన్న 14 రకాల గ్రూపుల స్థానంలో ఇకపై ఐదు రకాల కోర్ గ్రూపులుంటాయన్నారు. పార్ట్–1 కింద ఆంగ్లం, పార్ట్ –2 కింద 24 సబ్జెక్టుల్లో ఎంపిక చేసుకున్న ఒక సబ్జెక్టు, పార్ట్–3 కింద గ్రూప్ సబ్జెక్టులు ఉంటాయని తెలిపారు. ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి, ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.ఆంజనేయులు మాట్లాడుతూ థియరీ పరీక్షల నిర్వహణకు వీలుగా ట్రంకు పెట్టెలను సంసిద్ధం చేసుకోవాలన్నారు. పరీక్షల నిర్వహణలో తప్పిదాలు, పొరపాట్లు జరక్కుండా కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు చొరవ తీసుకోవాలని సూచించారు. సదస్సులో ఏకేవీకే జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రామిరెడ్డి, జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, పరీక్షల నిర్వహణలో భాగస్వాములయ్యే సిబ్బంది పాల్గొన్నారు.


