అల్లూరి చరిత్ర స్ఫూర్తిదాయకం
ఒంగోలు టౌన్: ప్రముఖ స్వాతంత్య్ర పోరాట వీరుడు, బ్రిటీష్ ముష్కరులను ముప్పుతిప్పలు పెట్టిన విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు చావలి సుధాకర్ అన్నారు. ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక మల్లయ్యలింగం భవన్‌లో ప్రముఖ చరిత్ర రచయిత సయ్యద్ నశీర్ అహమ్మద్ రచించిన అల్లూరికి అండగా నిలిచిన ఫజలుల్లా ఖాన్, షేక్ మదీనా పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇన్సాఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏ సాలార్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సుధాకర్ మాట్లాడుతూ.. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సోదరులందరూ కలిసి మెలసి జాతీయోద్యమాన్ని నిర్మించారని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం సాధించడానికి అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం జాతీయ స్థాయిలో పేరుపొందిందని చెప్పారు. మన్యం అడవులను కేంద్రంగా చేసుకొని గిరిజనులను చైతన్యం చేయడం ద్వారా బ్రిటీష్ ముష్కరులను నిద్రలేకుండా చేసిన సీతారామరాజుకు ఫజలుల్లా ఖాన్, షేక్ మదీనా అండగా నిలబడడం చరిత్రలో దాగని సత్యమని చెప్పారు. దేశ ప్రజల మధ్య విద్వేషాలను రాజేయడం ద్వారా నిర్విఘ్నంగా పరిపాలించాలని బ్రిటీష్ ముష్కరులు వేసిన ఎత్తుగడలు ఐక్యంగా తిప్పి కొట్టారని, అదే స్ఫూర్తితో నేడు కార్పొరేట్ కనుసన్నల్లో సాగుతున్న పాలకులకు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. ఈ ఆవిష్కరణలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డి.లక్ష్మి నారాయణ, ఎస్‌డీపీఐ రాష్ట్ర నాయకులు షేక్ సత్తార్, దళిత కవి కత్తి కళ్యాణ్, ఎంహెచ్‌పీఎస్ నాయకుడు అహమద్ బుజ్జి, రెడ్‌స్టార్ జిల్లా నాయకుడు బీమవరపు సుబ్బారావు, ఐపీఎల్ నాయకుడు దాసరి సుందరం పాల్గొన్నారు.


