పేదల పొట్ట కొట్టేందుకే ఉపాధిలో మార్పులు
ఒంగోలు టౌన్: గ్రామీణ నిరుపేద ప్రజల పొట్టలు కొట్టేందుకే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో మార్పులు చేపట్టిందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్‌కే మాబు విమర్శించారు. దేశ ప్రజల సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకే ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు. శుక్రవారం నగరంలోని బాపూజీ కాంప్లెక్స్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద సీపీఎం జిల్లా కమిటీ నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాబు మాట్లాడుతూ వామపక్ష పార్టీల ఉద్యమాల ఫలితంగా 2005లో నాటి యూపీఏ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని చట్టంలా తీసుకొచ్చిందని తెలిపారు. కొంతకాలంగా ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ వస్తున్న మోదీ ప్రభుత్వం వికసిత్ భారత్ ఆజీవికా మిషన్ పేరుతో గ్రామీణ ప్రజల జీవనోపాధిని దెబ్బకొట్టే చర్యలకు దిగిందని విమర్శించారు. పేరు మార్పుతో పాటుగా విధానాలను మార్పు చేయడం గ్రామీణ ప్రాంతాల వ్యవసాయ కూలీలకు ఇబ్బందులు తెచ్చిపెడుతోందని చెప్పారు. ఈ పథకం వలన కేవలం వ్యవసాయ కూలీలకు పని దొరకడమే కాకుండా దేశ వ్యాప్తంగా సాగునీరు, తాగునీటి వనరులు అభివృద్ధి చెంది వ్యవసాయం అభివృద్ధి చెందడం, అనుబంధ పరిశ్రమలు ఏర్పడడం ద్వారా దేశంలో ప్రజల కొనుగోలు శక్తి పెరిగి సంపద సృష్టి జరిగిందని చెప్పారు. చెక్ డ్యామ్‌లు, చెరువులు అభివృద్ధి చెందడంతో చిన్నకారు, సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరినట్లయిందని చెప్పారు. కరువు పీడిత ప్రాంతాల్లో విస్తారంగా పంటల సాగు ప్రయోజనం పొందారని, తద్వారా కూలీలకు ఉపాధి దక్కిందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు అమలులో ఉన్న నిబంధనల మేరకు 10 శాతం నిధులే చెల్లించలేని రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం నిధులు ముందస్తుగా డిపాజిట్ చేసే పరిస్థితులో ఉన్నారా అని ప్రశ్నించారు. ఏడాదిన్నర పాలనా కాలంలో 2.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉపాధి హామీ పథకాన్ని దెబ్బ తీస్తున్న కేంద్ర వైఖరిని ప్రశ్నించకుండా నోరుమెదపక పోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జీవీ కొండారెడ్డి మాట్లాడుతూ కేంద్రంతోపాటుగా రాష్ట్రంలోని పార్టీలతో కలిసి రాజ్యాంగాన్ని విధ్వంసం చేసేందుకు మోదీ సర్కార్ బరితెగిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలోని కూటమి పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి అడుగులకు మడుగులొత్తడం దిగజారుడుపాలనకు నిదర్శనమని మండిపడ్డారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదించేలోపు ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాలం సుబ్బారావు, పమిడి వెంకటరావు, వి.బాలకోటయ్య, కంకణాల రమాదేవి, జాలా అంజయ్య, సీహెచ్ రాంబాబు, రఘురాం, పి.కల్పన, వీరస్వామి, భక్తసింగ్ రాజు, శేషయ్య, ఆదిలక్ష్మి పాల్గొన్నారు.


