సురక్షిత నీటితోనే సంపూర్ణ ఆరోగ్యం
కొత్తపట్నం: సురక్షితమైన తాగునీరు అందించడం వలన అందరికీ సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా పంచాయతీ అధికారి ఎం.వెంకటేశ్వరరావు అన్నారు. మండలంలోని కె.పల్లెపాలెం గ్రామంలో బుధవారం గ్రామ సభకు హాజరై సిబ్బంది, ప్రజలకు పలు సలహాలు, సూచనలు చేశారు. ప్రతి 15 రోజులకు ఒకసారి అన్ని ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకులను పూర్తిగా శుభ్రపరచాలన్నారు. నీటి నమూనాలను పరీక్షించి ఎలాంటి కలుషితం కాకుండా నిర్ధారించాలన్నారు. బోర్లనీటి నమూనాలను ఇంజినీరింగ్ అసిస్టెంట్ సహాయంతో ఎఫ్‌టీకే ద్వారా ప్రజల సమక్షంలో పరీక్షించాలన్నారు. నిర్వహించిన అన్ని పరీక్షల వివరాలను కచ్చితంగా రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. గ్రామ ప్రజలకు సురక్షిత, శుభ్రమైన తాగునీరు అందించడంలో బాధ్యతాయుతంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి పరీక్షల ద్వారా నిర్ధారణ చేసుకుని మాత్రమే ప్రజలకు స్వచ్ఛమైన నీరు సరఫరా చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీకృష్ణ, ఇన్‌చార్జి డిప్యూటీ ఎంపీడీవో జి.నాగేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యుడు పిన్ని నరసింహారావు, పీడీవో డాక్టర్ జె.సంపత్, డీఎఫ్‌సీఎస్‌జీ పేరయ్య, ప్రభుప్రకాశ్, చాపల జాలరాం, పిన్ని దేవప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పంచాయతీ అధికారి
ఎం.వెంకటేశ్వరరావు


