నేడు ఉపాధ్యాయుల సమస్యలపై ధర్నా
ఒంగోలు సిటీ: ఉపాధ్యాయుల సమస్యలపై ఈ నెల 18న ఒంగోలు కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ అబ్దుల్ హై, డి.వీరాంజనేయులు పిలుపునిచ్చారు. స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. 2010కి ముందు ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలని, ఆ మేరకు విద్యాహక్కు చట్టం సవరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని కోరారు. పదో తరగతి 100 రోజుల కార్యాచరణలో భాగంగా విద్యార్థుల శారీరక, మానసిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆదివారాలు, సెలవు రోజుల్లో తరగతులు రద్దు చేయాలన్నారు. ఎఫ్‌ఎల్‌ఎన్ 75 రోజుల ప్రోగ్రాం అమల్లో కూడా విద్యార్థులకు స్వేచ్ఛగా వారికి రాని అంశాలు నేర్పించే అవకాశం కల్పించాలని కోరారు. సింగిల్ టీచర్లు సెలవుల విషయంలో ఓహెచ్‌లు ఉపయోగించుకునే విషయంలో పడుతున్న ఇబ్బందులను తొలగించాలని కోరారు. గురుకుల సంక్షేమ పాఠశాలలో ఉపాధ్యాయులపై ఆ శాఖ ఉన్నతాధికారులు నుంచి కిందిస్థాయి అధికారుల వరకు వ్యవహరిస్తున్న తీరు మార్చుకోవాలన్నారు. జిల్లాలోని కొన్ని మండలాల్లో ఎంఈఓలు మహిళా ఉపాధ్యాయులపై పట్ల వ్యవహరిస్తున్న తీరును సరిచేసుకోవాలని కోరారు. ధర్నాను విజయవంతం చేసేందుకు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ధర్నా అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయడం, సమస్యలపై డీఈఓతో చర్చిస్తామని పేర్కొన్నారు.


