పనులు చేయించారు.. బిల్లులు ఇవ్వరేం?
గిద్దలూరు రూరల్: గ్రామ పంచాయతీల్లో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు నెలల తరబడి చెల్లించకుండా బకాయి పెట్టడంపై గిద్దలూరు మండల సర్పంచ్‌లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం గిద్దలూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నుంచి వాకౌట్ చేసి కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. సర్వసభ్య సమావేశం మొదలైన కాసేపట్టికే బిల్లుల చెల్లింపుపై ఎంపీడీఓ సీతారామయ్యను ప్రశ్నించిన సర్పంచ్‌లు.. సరైన సమాధారం ఇవ్వకపోవడంతో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ హాల్ నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లు మాట్లాడుతూ.. ‘గ్రామాల్లో తాగు నీటి సమస్య పరిష్కారం కోసం బోర్లకు మరమ్మతులు చేయించాం. పైపులైన్ల లీకేజీలను సరిచేయించాం. అధికారుల సూచన మేరకే వీధిలైట్లు, పారిశుధ్యం, ఇతర అభివృద్ధి పనులు చేశాం. గత 6 నెలలుగా ఖర్చు చేసిన నిధుల తాలూకు బిల్లులు ప్రభుత్వం నుంచి ఇంత వరకు విడుదల కాలేదు. నిధులివ్వకుంటే ఇకపై పనులెలా చేయగలం. ఒక్కో పంచాయతీకి సుమారు రూ.5 లక్షల మేర నిధులు విడుదల చేయాల్సి ఉంది. అప్పులు చేసి పనులు చేపట్టామని మొత్తుకుంటున్నా బిల్లులివ్వకుండా కాలయాపన చేయడం సరికాద’ని ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని, ఇప్పటికై నా ప్రభుత్వం బిల్లులివ్వాలని విజ్ఞప్తి చేశారు. నిరసన ప్రదర్శనలో సర్పంచ్‌లు ఏరువ రాజశేఖరరెడ్డి, బండి శ్రీనివాసులు, లక్ష్మీ ప్రసన్న, సమాధుల రాజేశ్వరి, అంజినాయక్ తదితరులు పాల్గొనగా ఎంపీపీ కడప లక్ష్మి సంఘీభావం తెలిపారు.
గిద్దలూరులో సర్వసభ్య సమావేశం నుంచి సర్పంచ్‌ల వాకౌట్
ఒక్కో పంచాయతీకి రూ.5 లక్షలకు పైగా బిల్లుల బకాయి
6 నెలలుగా బిల్లులు చెల్లించడం లేదని మండిపాటు


