రెండు గృహాల్లో చోరీ
● రూ.10 లక్షల విలువైన సొత్తు అపహరణ
సింగరాయకొండ: మండలంలోని మూలగుంటపాడు గ్రామ పంచాయతీలో రెండు గృహాల్లో రూ.10 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దుండగులు చోరీకి పాల్పడ్డారు. స్థానికుల కథనం ప్రకారం..గ్రామంలోని నక్కపాలెంలో నివసిస్తున్న బొడ్డు వినయ్‌కుమార్ ఈ నెల 12న విజయవాడ వెళ్లి సోమవారం ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటి మెయిన్‌డోర్ గడి ధ్వంరమై ఉండటంతో ఇంట్లోకి వెళ్లి చూడగా ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాను పరిశీలించగా రెండు సవర్ల బంగారు చైను, రెండు ఉంగరాలు, రెండు వెండి కుందులు చోరీకి గురైనట్లు నిర్ధారించారు. అదే విధంగా విద్యానగర్ 5వ లైనులో నివసిస్తున్న తలమంచి కృష్ణారెడ్డి ఈ నెల 13వ తేదీ శనివారం అనారోగ్యంగా ఉండటంతో నెల్లూరు ఆస్పత్రికి వెళ్లి వచ్చేటప్పుడు కావలిలోని కుమార్తె ఇంటికి వెళ్లి సోమవారం ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటికి రాగానే ఇంటి ప్రధాన తలుపు గడి విరిగిపోయి ఉండటాన్ని గమనించి లోపలికి వెళ్లి చూడగా ఇంట్లో బీరువాలోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. ఇంట్లో తన తల్లికి చెందిన 7 సవర్ల బంగారం వస్తువులు, దేవుడి గదిలోని 600 గ్రాముల వెండి గ్లాసులు, ప్లేటు, రెండు కుందులు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా..క్లూస్‌టీం వచ్చి ఆధారాలు సేకరించారు.


