మార్కాపురం జిల్లాకు అన్యాయం చేయొద్దు
● దర్శితో కూడిన మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయాలి
ఒంగోలు టౌన్: దర్శి నియోజకవర్గంతో కూడిన మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయాలని సీపీఐ నాయకులు ప్రతిపాదించారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వో చిన ఓబులసును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ...మార్కాపురం కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉండే దొనకొండ మండలం, 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కురిచేడు, 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న దర్శి మండలాలను నూతన జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు. వీలైతే దర్శి నియోజకవర్గాన్ని మార్కాపురంలో కలిపితే బాగుంటుందన్నారు. జిల్లా కేంద్రమైన నంద్యాలకు 160 నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం మండలాన్ని కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్కాపురంలో కలపడమే మేలని చెప్పారు. దీనికి భిన్నంగా మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాలతో జిల్లాను ఏర్పాటు చేస్తే కొత్త జిల్లాకు అన్యాయం చేసినట్లే అవుతుందన్నారు. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికి తాగునీరు అందించేందుకు నాడు దర్శిలో ఎన్‌ఎస్‌పీ స్టోరేజీ చెరువును ప్రభుత్వం నిర్మించిందని, ఇక్కడ నుంచే కనిగిరి, పొదిలి తదితర ప్రాంతాలకు తాగునీరు అందిస్తారన్నారు. ఇప్పుడు దర్శి మండలాన్ని ప్రకాశం జిల్లాలో కొనసాగిస్తే ఎటువంటి నీటి ఆధారం లేని ప్రాంతాలకు తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం చేసిన కోట్లాది రూపాయల ఖర్చు నిరుపయోగంగా మారే అవకాశం కూడా ఉందన్నారు. తాగునీటి కోసం మార్కాపురం జిల్లాను ప్రకాశం జిల్లా మీద ఆధారపడేలా చేయడం భావ్యం కాదన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు దొనకొండలో ప్రభుత్వం భూములను కూడా గుర్తించిందని, బ్రిటీష్ కాలం నుంచి దొనకొండలో విమానాశ్రయం ఉందని, ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇవన్నీ ప్రకాశం జిల్లాలోకే వెళ్లిపోతాయని చెప్పారు. మార్కాపురం జిల్లా అభివృద్ధికి దొనకొండను కలపాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. వీటన్నింటినీ ప్రభుత్వం సమగ్రంగా విశ్లేషించి తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు. పశ్చిమ ప్రకాశం కోసం అనేక పోరాటాలు చేసిన ప్రజా నాయకుడు పూల సుబ్బయ్య పేరుతో మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఆర్.వెంకటరావు, అందే నాసరయ్య, డి.శ్రీనివాస్, సయ్యద్ యాసిన్, ఎంఏ సాలార్, ఎస్‌కే ఖాశీం, శ్రీరాం శ్రీనివాసరావు, విజయ, లక్ష్మి, కరుణానిధి, ప్రభాకర్, గులాం పాల్గొన్నారు.


