తెలుగు ప్రజల ఆత్మగౌరవం.. అమరజీవి
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
ఒంగోలు సిటీ: రాష్ట్ర ఆవిర్భావం కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. సోమవారం ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, కె.నాగార్జునరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు, కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ దద్దాల నారాయణ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు ఉడుముల శ్రీనివాసులరెడ్డి, కసుకుర్తి ఆదెన్నతో కలిసి అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం వలనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవడం ఒక్కటే ఆయనకు నిజమైన నివాళి అని చెప్పారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి పొట్టి శ్రీరాములు ప్రధాన కారకులయ్యారని చెప్పారు. పొట్టి శ్రీరాములు ఆశయాలను నేటి తరం అధ్యయనం చేసి ఆచరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కె.వి.రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, బొట్ల రామారావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అమరజీవి త్యాగ ఫలితమే తెలుగు రాష్ట్రం : మంత్రి డోల
ఒంగోలు సబర్బన్: అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగ ఫలితమే తెలుగు రాష్ట్ర అవతరణ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి అన్నారు. సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా స్థానిక సీవీఎన్ రీడింగ్ రూమ్ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి కలెక్టర్ పీ రాజాబాబు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి డోలా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగు భాష మాట్లాడే ప్రజలందరికీ ప్రత్యేక రాష్ట్రం కావాలని 58 రోజులపాటు పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేశారన్నారు. ఆయన మరణించిన 10 నెలల తర్వాత ప్రత్యేక ఆంధ్రరాష్ట్రాన్ని ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ ఆంధ్రుల పౌరుషానికి ప్రతీకగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని చెప్పారు. పొట్టి శ్రీరాములు ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్, జేసీ ఆర్.గోపాలకృష్ణ, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి లక్ష్మానాయక్, స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణ, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, ఒంగోలు అర్బన్ తహసీల్దార్ మధుసూదన్‌రావు, ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తెలుగు ప్రజల ఆత్మగౌరవం.. అమరజీవి


