ఈతముక్కల తీరం సమీపంలో సోనా బోట్లు
కొత్తపట్నం: కడలూరు, నాగపట్నం, పాండిచ్చేరి ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు మరోసారి బరితెగించారు. కొత్తపట్నం మండలంలోని ఈతముక్కల తీరానికి సమీపంలో నాలుగు రోజులుగా సోనా బోట్లతో చేపల వేట సాగిస్తూ రెచ్చిపోతున్నారు. రోజురోజుకూ హద్దు మీరి తీరం దగ్గరకు వచ్చి మరీ చేపలు వేటాడుతున్నారు. దీంతో చిన్నచిన్న చేపలను కూడా కోల్పోతామంటూ స్థానిక మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. సోనా బోట్లతో చేపల వేట సమయంలో రాష్ట్రాల సరిహద్దులు దాటకూడదని కేంద్ర మత్స్యశాఖ నిబంధనలు విధించినప్పటికీ పట్టించుకోకుండా ఏపీలోకి ప్రవేశించి ఏకంగా తీరం సమీపంలోనే చేపలు వేటాడుతున్నారు. కడలూరు బీచ్ నుంచి వచ్చి ఆంధ్ర సరిహద్దుల్లో ఎక్కడబడితే అక్కడ వేట కొనసాగిస్తున్నారు. నాలుగు రోజుల నుంచి ఈతముక్కల బీచ్ సమీపంలో వేట సాగిస్తుండగా, మత్స్యశాఖ అధికారులు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నా రని స్థానిక మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. ఈతముక్కల బీచ్ సమీ పంలో స్థానికులైన చిరు మత్స్యకారులు కండ్లు వల వేసి వేట సాగిస్తున్నారు. మొయ్య చేపలు పడుతున్నాయి. అవి కూడా దక్కనీయకుండా సోనా బోట్లతో వచ్చి కడలూరు మత్స్యకారులు వేట సాగిస్తున్నారని స్థానిక మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మత్స్యశాఖ అధికారులు దీనిపై స్పందించి కడలూరు సోనా బోట్లను అదుపు చేయాలని కోరుతున్నారు.
ఆందోళనలో స్థానిక మత్స్యకారులు
మత్స్యశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు
ఈతముక్కల తీరం సమీపంలో సోనా బోట్లు


