బాధితులకు సత్వర న్యాయం అందించాలి
● ఎస్పీ హర్షవర్థన్‌రాజు
ఒంగోలు టౌన్: ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం మీకోసంలో వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ హర్షవర్థన్ రాజు ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీకోసంకు 90 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదుదారులతో ఎస్పీ మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చట్టపరంగా విచారణ జరిపి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మీ కోసం ఫిర్యాదుల పట్ల అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి అలసత్వం లేకుండా నిర్ణీత సమయంలో పరిష్కారం చూపాలన్నారు. ఫిర్యాదు చేయడానికి వచ్చే వృద్ధులు, నడవలేని పరిస్థితిలో వున్న వారి సమస్యలను ప్రత్యేకంగా పరిశీలనలోకి తీసుకోవాలని చెప్పారు. సంఘటన స్థలాలను సందర్శించి చట్ట ప్రకారం పరిష్కారం చూపాలన్నారు. జిల్లా పోలీసు కార్యాలయానికి రాలేని ప్రజలు స్థానిక పోలీసు స్టేషన్‌లో, సబ్ డివిజన్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ రమణ కుమార్, తాలూకా సీఐ విజయ కృష్ణ, దర్శి సీఐ రామారావు, కంభం సీఐ మల్లికార్జున, కనిగిరి సీఐ శ్రీనివాసులు, పీసీఆర్ సీఐ దుర్గా ప్రసాద్, ప్యానల్ అడ్వకేట్ బి.బాలాజీ, మీకోసం ఎస్సై జనార్దన్‌రావు పాల్గొన్నారు.
అమరజీవికి నివాళులు...
జిల్లా పోలీసు కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఎస్పీ హర్షవర్థన్‌రాజు, మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ రమణ కుమార్, ఎస్బీ సీఐ శ్రీనివాసరావు, పీసీఆర్ సీఐ దుర్గా ప్రసాద్, డీటీసీ సీఐ పాండురంగారావు, ఆర్‌ఐ రమణారెడ్డి తదితరులు నివాళులర్పించారు.


