సేవ్ యరజర్ల..సేవ్ ఎర్త్..
● యరజర్లలో అక్రమ మట్టి తవ్వకాలు ఆపాలని గ్రామస్తుల నిరసన
ఒంగోలు సబర్బన్:
టంగుటూరు మండలం యరజర్లలో అక్రమ ఎర్ర మట్టి తరలింపును అడ్డుకోవాలని గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు ఇష్టమొచ్చినట్లు అక్రమంగా ఎర్రమట్టి తరలిస్తున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నిత్యం వందల సంఖ్యలో పెద్ద పెద్ద టిప్పర్లు అక్రమంగా మట్టి తరలిస్తున్నా మైనింగ్ శాఖ అధికారులు నిద్రమత్తులో నటిస్తున్నారని విమర్శించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేయింబవళ్లు గ్రామస్తుల పొలాల్లో నుంచి ఇష్టంవచ్చినట్లు తరలిస్తున్నారన్నారు. అక్రమ తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఉందని, ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. యరజర్లకు చెందిన అన్నపరెడ్డి బ్రహ్మానందబాబు ఆధ్వర్యంలో శెట్టి వెంకటేశ్వర్లు, పుచ్చకాయల ఆంజనేయులు, ఖాశీంబీ తదితరులు పాల్గొన్నారు.


