‘ఉపాధి’ నిర్వీర్యం చేసే కుట్రలు ఆపండి
వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల ఆంజనేయులు
ఒంగోలు టౌన్: దేశంలోని గ్రామీణ నిరుపేద ప్రజలకు ఎంతోకొంత భరోసా ఇస్తున్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఆపాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల ఆంజనేయులు డిమాండ్ చేశారు. సుందరయ్య భవనంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ స్వాతంత్య్రం తరువాత అనేక చట్టాల్లో గ్రామీణ ప్రాంత ప్రజలకు జీవనోపాధి చూపుతున్న ఉపాధి హామీ పథకం ఒక వరం వంటిదన్నారు. ఉపాధి హామీ పథకాన్ని చట్టంగా చేశారంటే పనిని గ్యారంటీగా కల్పించడమని అర్థమని, ఇందుకు ప్రభుత్వం బాధ్యతగా ఉంటుందని భరోసా ఇవ్వడమేనని చెప్పారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం పూజ్యబాపు గ్రామీణ రోజ్‌గార్ యోజన అని పేరు మార్చిందని తెలిపారు. పైకి పేరు మాత్రమే మార్చినట్లు కనిపిస్తున్నా పని గ్యారంటీ అనే పదాన్ని తొలగించడం ప్రజలను మోసం చేయడమేనని మండిపడ్డారు. ఉపాధి చట్టాన్ని ఒక పథకంగా మార్చి దానిని అమలు చేయవచ్చు చేయకపోవచ్చనేలా బలహీనపరిచారని చెప్పారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నెరుసుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పేదరిక నిర్మూలన, వలసల నివారణ, గ్రామీణ సమాజంలో నీటి వనరులు, ఆస్తులు సమకూర్చడం, గ్రామీణ పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం వంటి ఉత్తమ లక్ష్యాలతో యూపీఏ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. మొదట కేంద్ర బడ్జెట్లో 4 శాతం నిధులు కేటాయించారని, మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత క్రమంగా నిర్వీర్యం చేస్తూ 1.3 శాతానికి తగ్గించారని చెప్పారు. నిజంగా గ్రామీణ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే కేంద్ర బడ్జెట్లో ఏడాదికి రూ.2.5 లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. 200 రోజుల పని, రోజు వేతనం రూ.600 కు పెంచాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేక పట్టణాలకు వలస వస్తున్న పేదలకు పని కల్పించేలా పట్టణాలకు కూడా ఉపాధి హామీ విస్తరించాలని ప్రజలు కోరుతుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పని ప్రదేశంలో రెండు పూటలా ఫొటోలు తీయాలని, ఈకేవైసీ చేయించాలని రకరకాల సాకులు చెబుతూ లక్షలాది మంది పేదల జాబ్ కార్డులను తొలగించారని, పనులు చేసిన కూలీలకు నెలల తరబడి వేతనాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడాలంటే గ్రామీణ పేదల కొనుగోలు శక్తి పెరిగితేనే సాధ్యపడుతుందని, అందుకు ఉపాధి హామీ చట్టాన్ని మరింత విస్తరించడమే కాకుండా పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.


