ప్రయోగానికిపంగనామం.! | - | Sakshi
Sakshi News home page

ప్రయోగానికిపంగనామం.!

Dec 15 2025 10:19 AM | Updated on Dec 15 2025 10:19 AM

ప్రయోగానికిపంగనామం.!

ప్రయోగానికిపంగనామం.!

కనిగిరి రూరల్‌: చంద్రబాబుకు మొదటి నుంచీ రైతన్నలంటే చులకనే. ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా వ్యవసాయాన్ని, రైతులను చిన్నచూపు చూస్తుంటారు. ఈసారీ అదే జరుగుతోంది. అన్నదాతలు ఎదుర్కొంటోన్న అనేక సమస్యలే అందుకు నిదర్శనంగా ఉన్నాయి. వీటికితోడు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో రూ.కోట్లు వెచ్చించి రైతన్న సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన అగ్రి టెస్ట్‌ ల్యాబ్‌లను నిర్వీర్యం చేసింది. జిల్లాలో మొత్తం 7 అగ్రి టెస్ట్‌ ల్యాబ్‌లకుగానూ రెండు పనిచేస్తుండగా, ఒకటి నిర్మాణ దశలో ఆగిపోయింది. మిగతా నాలుగు అగ్రి ల్యాబ్‌లు సుమారు ఏడాది నుంచి మూతబడ్డాయి. రైతులకు నాడు ఎంతో మేలు చేసిన అగ్రి టెస్ట్‌ ల్యాబ్‌లు నేడు నిర్వీర్యంగా మారి పాలకుల నిర్లక్ష్యాన్ని, చేతగానితనాన్ని వెక్కిరిస్తున్నాయి. ఆయా ల్యాబ్‌లకు చెందిన కోట్ల విలువ చేసే భవనాలు, పరికరాలు నిరుపయోగంగా మారుతున్నాయి.

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో

రూ.కోటితో ఏర్పాటు...

ఎంతో ఉన్నత లక్ష్యం, ఆశయంతో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో రైతన్న సంక్షేమం కోసం సుమారు రూ.కోటి ఖర్చు పెట్టి అగ్రి టెస్ట్‌ ల్యాబ్‌లు నిర్మించారు. ప్రధానంగా వ్యవసాయంలో కల్తీ నివారణే లక్ష్యంగా ఏర్పాటు చేశారు. రైతులు ఉపయోగించే విత్తనాలు, ఎరువుల నాణ్యతను పరీక్షించిన తర్వాత సాగుచేపడితే మేలైన దిగుబడులు సాధించే వీలుంటుందనే ఉద్దేశంతో అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లను ఆనాటి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సుమారు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షలతో భవన నిర్మాణాలు, రూ.40 లక్షల ఖర్చుతో వివిధ రకాల విలువైన పరికరాలు, రసాయనాలు, కంప్యూటరైజ్డ్‌ సిస్టమ్‌లను అందుబాటులోకి తెచ్చింది. కనిగిరిలోని ఏఎంసీ కార్యాలయ ఆవరణలో డాక్టర్‌ వైఎస్సార్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌ను ప్రారంభించారు. 2021లో దీనిని ప్రారంభించిన తర్వాత నెల రోజులకే 15 నుంచి 20 వరకు పరీక్షల నమూనాలు రైతుల నుంచి వచ్చేవి. కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల రైతన్నలకు ఇది ఎంతగానో ఉపయోగపడింది. అయితే చంద్రబాబు సర్కార్‌ వచ్చిన తర్వాత ఈ ల్యాబ్‌లు మూతపడ్డాయి. రూ.లక్షల విలువైన సామగ్రి నిరుపయోగంగా మారింది.

ఏటా 1200 నుంచి 1500 వరకు పరీక్షలు...

కనిగిరి వ్యవసాయ సబ్‌ డివిజన్‌లోని ఆరు మండలాల్లో ఖరీఫ్‌లో సాధారణ విస్తీర్ణం 29,050 హెక్టార్లు కాగా, సాగు విస్తీర్ణం 37,118 హెక్టార్ల వరకు ఉండేది. రబీలో సాధారణ విస్తీర్ణం 24,361 హెక్టార్లు కాగా, ఇప్పటి వరకు 9,060 హెక్టార్లకుపైగా వివిధ రకాల పంటలు సాగులో ఉన్నాయి. ఇంకా చాలా మంది రైతులు పంటల సాగుకు భూములు సిద్ధం చేసుకుంటున్నారు. కంది సాధారణ విస్తీర్ణం 15,193 హెక్టార్లు కాగా, ఇప్పటి వరకూ అత్యధికంగా 21,968 హెక్టార్లలో సాగు చేశారు. రైతులే స్వయంగా నేరుగా విత్తనాలు, ఎరువులు పరీక్షించుకునేందుకు ఉపయోగకరంగా ఉండేది. రైతులే స్వయంగా విత్తన పరీక్షలు, నాణ్యత పరీక్షలను రైతు భరోసా కేంద్రాల ద్వారా అగ్రి ల్యాబ్‌లకు వచ్చి జరిపించుకునేవారు. ఏటా సుమారు 270 నుంచి 300 మంది వరకు ల్యాబ్‌లలో పరీక్షలు చేయించుకునేవారు. 2021 నుంచి ప్రతి ఏటా సుమారు 1200 నుంచి 1500 వరకు పరీక్షలు జరిగేవి.

విత్తనాలు, ఎరువులు, మందులకు పరీక్షలు...

రైతులు విత్తనాలను పరీక్షించుకున్న తర్వాతే భూమిలో నాటాలన్న ఉన్నతాశయంతో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. దీంతో కనిగిరి ప్రాంత రైతులు దీన్ని బాగా సద్వినియోగం చేసుకున్నారు. ఎరువులు, విత్తనాల నాణ్యతను పరీక్షించుకుని నివేదికల తర్వాత సాగుచేసుకునేవారు. వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో మూడు రకాలుగా జర్మినేషన్‌, ఫిజికల్‌ ప్యూరిటీ, మాయిశ్చర్‌ పద్ధతుల్లో ఇద్దర అధికారులు పరిశీలన జరిపేవారు. అంతేగాకుండా నత్రజని, పొటాషియం, భాస్వరం సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు రసాయనాలను ఉపయోగించేవారు. ఎరువుల నాణ్యతను గుర్తించి ఆ తర్వాత పంటలు సాగు చేసుకునేందుకు రైతులకు వ్యవసాయ అధికారులు సలహాలు, సూచనలు చేసేవారు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. అగ్రి ల్యాబ్‌లను చంద్రబాబు ప్రభుత్వం మూసివేయడంతో వాటిలో పనిచేసే అధికారులను ఇతర విభాగాలకు డిప్యుటేషన్‌ వేశారు. దీంతో విత్తనాలు, ఎరువుల పరీక్షలకు దర్శి వెళ్లాల్సి వస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

అగ్రి టెస్ట్‌ ల్యాబ్‌లను నిర్వీర్యం చేసిన చంద్రబాబు ప్రభుత్వం

లక్షల రూపాయల విలువైన భవనాలు, పరికరాలు నిరుపయోగం

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేయగా ఎంతో ఉపయోగపడిన వైనం

ఏడాదిన్నరగా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోక శిథిలమవుతున్న భవనాలు

వ్యవసాయాన్ని చిన్నచూపు చూడటంపై అన్నదాతల ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement