హెల్మెట్ వాడకంతో ప్రాణరక్షణ
● ఎస్పీ హర్షవర్థన్‌రాజు
ఒంగోలు టౌన్: రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయం నుంచి బయటపడాలంటే హెల్మెట్ ధరించడం ఒక్కటే మార్గమని ఎస్పీ హర్షవర్థన్ రాజు తెలిపారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బందితో హెల్మెట్ వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్న వారిలో తలకు హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపేవారే ఎక్కువగా ఉంటున్నారని తెలిపారు. తలకు గాయం కావడం వలన తీవ్ర రక్తస్రావం జరిగుతోందని, దాంతో వైద్యం అందించే సమయం కూడా లేకుండా పోతోందని చెప్పారు. ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా తలకు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. ఇది ద్విచక్ర వాహనాలు నడిపేవారికి రక్షణ కవచంలా పనిచేస్తుందన్నారు. వాహనదారులు ప్రతిఒక్కరూ తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మైనర్లు వాహనం నడపకూడదని హెచ్చరించారు. అతివేగం, ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, ఎంతమాత్రం మంచిదికాదన్నారు. రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించుకోవడమే కాకుండా ఆ నియమాలను పాటించాలని చెప్పారు. కుటుంబ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని డ్రైవింగ్ చేయాలని సూచించారు.


