రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య
కంభం: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. రైల్వే ట్రాక్‌పై తల, మొండెం వేరుగా పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు మార్కాపురం మండలం పిడుదలనర్వకు చెందిన నరేంద్రారెడ్డిగా రైల్వే పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.
తాళ్లూరు:
బైక్ అదుపుతప్పి వ్యక్తికి తీవ్రగాయాలైన సంఘటన తాళ్లూరు మండలంలోని తూర్పుగంగవరం–చీమకుర్తి ప్రధాన రహదారిపై గుంటి గంగమ్మ దేవస్థానం సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. మండలంలోని దోసకాయలపాడు గ్రామానికి చెందిన రామయ్య అనే వ్యక్తి పని నిమిత్తం బైక్‌పై చీమకుర్తి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా అదుపుతప్పి ప్రమాదం జరిగింది. గాయపడిన రామయ్యను వైద్యం నిమిత్తం తూర్పుగంగవరంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. రహదారులు గుంతలతో అధ్వానంగా తయారవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.
ఒంగోలు టౌన్:
నగరంలో థైరాయిడ్ పరీక్షలు నిర్వహించే వ్యక్తి ఒకరు అనుమానాస్పద స్థితిలో మరణించారు. పోలీసుల కథనం ప్రకారం... టంగుటూరు మండలం అలకూరపాడు గ్రామానికి చెందిన లేళ్లపల్లి రాజ్‌కుమార్ ఒంగోలు నగరంలోని 60 అడుగుల రోడ్డులో కొంతకాలంగా థైరోకేర్ క్లినిక్ నిర్వహిస్తున్నారు. రోగుల నుంచి రక్తం సేకరించి థైరాయిడ్ పరీక్షలు చేయిస్తుంటాడు. మనస్పర్థల కారణంగా భార్య విడిచిపెట్టి వెళ్లింది. దాంతో మద్యానికి బానిసయ్యాడు. క్లినిక్‌లోని సోఫాలో నుంచి కిందపడిపోయి మరణించి ఉన్నాడు. ఆదివారం ఉదయం రిపోర్టుల కోసం వచ్చిన వ్యక్తి చూసి ఇరుగుపొరుగు వారికి చెప్పారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. రాజ్‌కుమార్ చనిపోయి రెండుమూడు రోజులై ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఒంగోలు జీజీహెచ్‌కి తరలించారు. ఒంగోలు తాలూకా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


