పుష్కరాలలో మునిగితే అంటురోగాలు
● హేతువాద సంఘ అధ్యక్షుడు వెంకటసుబ్బయ్య
ఒంగోలు వన్‌టౌన్: పుష్కరాలలో మునిగితే వచ్చేది పుణ్యం కాదని, అంటురోగాలని భారత హేతువాద సంఘ అధ్యక్షుడు నార్నె వెంకటసుబ్బయ్య అన్నారు. ఒంగోలులోని సీపీఐ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా ఆధునిక విజ్ఞానం పెరిగిపోతుంటే మన దేశంలో మాత్రం మూఢనమ్మకాలు పెరిగిపోతున్నాయన్నారు. మూఢ నమ్మకాలు అరికట్టాల్సిన పాలకులే.. పుష్కారాలలో మునిగితే పుణ్యం వస్తుందని ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు ముహూర్తాలు నిర్ణయించి వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తున్నారన్నారు. రాజమండ్రి వద్ద జరిగే గోదావరి పుష్కరాలకు 5700 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి ప్రకటించారన్నారు. ప్రజా ధనాన్ని మతపరమైన కార్యక్రమాలకు వినియోగించకూడదన్నారు. పుష్కరాలలో మునిగితే పుణ్యం వస్తుందని మతపరమైన సంస్థలు, పీఠాధిపతులు చెప్పుకుంటారని, కానీ, ప్రజాప్రతినిధులకు ఏం పనని ప్రశ్నించారు. కుంభమేళాలో మునిగితే పుణ్యం వస్తుందని దేశ ప్రధాని, యూపీ ముఖ్యమంత్రి ప్రజలను రెచ్చగొట్టి వందలాది మంది మృతికి కారణమయ్యారన్నారు. కుంభమేళాలో ఎంత మంది చనిపోయింది లెక్కలేదన్నారు. గంగా నదిలో ఎన్ని శవాలు తెలియాడాయో లెక్క చెప్పలన్నారు. కచ్చితంగా ఈ సంఘటనకు దేశ ప్రధాని మోదీ బాధ్యత వహించాలన్నారు. 2015లో రాష్ట్రంలో జరిగిన గోదావరి పుష్కరాలలో 30 మంది చనిపోయారని, అందుకు అప్పటి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. విలేకరుల సమావేశంలో హేతువాద సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మొగల్ కాలేషా బేగ్, సభ్యులు ఎస్‌వీ రంగారెడ్డి, ఒంగవోలు నాగేశ్వరరావు, సుభానీ, ఎస్.చంద్రశేఖరబాబు తదితరులు పాల్గొన్నారు.


