జాతీయ మహాసభలను జయప్రదం చేయండి
● సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ పిలుపు
ఒంగోలు టౌన్: సీఐటీయూ అఖిల భారత మహాసభలు ఈ నెల 31 నుంచి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్టణంలో జరగనున్నాయని, జిల్లా నుంచి అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్ పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని 49వ డివిజన్‌లో సీఐటీయూ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లపై మహాసభలలో చర్చించనున్నట్లు తెలిపారు. అంతేగాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భవిష్యత్తులో ఉద్యమానికి రూపకల్పన చేయనున్నట్లు చెప్పారు. లేబర్ కోడ్లను ఉపసంహరించుకునేంత వరకు పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. లేకపోతే కార్మికుల హక్కులతో పాటు ప్రజల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటుందన్నారు. లేబర్ కోడ్లు కేవలం కార్మికుల సమస్య మాత్రమే కాదని, యావత్ ప్రజలతో ముడిపడి ఉన్న అంశమని చెప్పారు. దేశ ప్రజలంతా ముక్తకంఠంతో వ్యతిరేకించాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు జి.రమేష్, జి.ఆదిలక్ష్మి, కె.రాజేశ్వరి, వీరాస్వామి, ఆర్.పెంచల కొండయ్య, రామయ్య, డి.కోటయ్య, ఎస్‌కే సుభాని, వి.కాశిం, టి.వీరయ్య పాల్గొన్నారు.


