పీపీపీతో ఊపిరి తీసి.. | - | Sakshi
Sakshi News home page

పీపీపీతో ఊపిరి తీసి..

Dec 15 2025 10:17 AM | Updated on Dec 15 2025 10:17 AM

పీపీపీతో ఊపిరి తీసి..

పీపీపీతో ఊపిరి తీసి..

కోటి సంతకాల ఉద్యమంతో ఉవ్వెత్తున నిరసన గళం

నాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మార్కాపురం మెడికల్‌ కాలేజీకి రూ.450 కోట్లు మంజూరు 70 శాతానికి పైగా పనులు పూర్తి చంద్రబాబు ప్రభుత్వం రాగానే నిలిచిన పనులు ప్రైవేటీకరించేందుకు పీపీపీకి కట్టబెట్టిన బాబు నిరసనగా వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల ఉద్యమం జిల్లాలో 5.26 లక్షలకుపైగా సంతకాల సేకరణ నేడు జిల్లా కేంద్రం నుంచి తాడేపల్లికి సంతకాల తరలింపు

కోటి సంతకాల ఉద్యమంతో ఉవ్వెత్తున నిరసన గళం

మార్కాపురం:

న్ని విధాలుగా వెనుకబడిన పశ్చిమ ప్రాంత ప్రజలకు కార్పొరేట్‌ వైద్యం ఉచితంగా అందించేందుకు, పేదలకు వైద్య విద్యను చేరువ చేసేందుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మార్కాపురానికి మెడికల్‌ కాలేజీని మంజూరు చేయడంతోపాటు రూ.450 కోట్లు కేటాయించారు. మార్కాపురం మండలం రాయవరం వద్ద 41.97 ఎకరాల స్థలంలో పనులు వేగంగా చేయించారు. 70 శాతం పనులు పూర్తికాగానే గత ఏడాది ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో తాత్కాలికంగా ఆగిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెడికల్‌ కాలేజీ పనులు నిలిపేశారు. కొన్ని నెలల తరువాత పీపీపీ విధానంలో నిర్మిస్తామని అన్నారు. ఇదే సమయంలో జీజీహెచ్‌ ఊపిరి కూడా తీశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో 75 మంది డాక్టర్లు ఉన్న వైద్యశాల కూటమి ప్రభుత్వం రాగానే వైద్యులను బదిలీ చేయడంతో 22కు చేరింది. 500 నుంచి 600 మధ్య ఉన్న ఓపీ ఒక్కసారిగా 300 నుంచి 350కు పడిపోయింది. అత్యవసర వైద్యసేవల కోసం 2018 నాటి పరిస్థితులు పునరావృతం కావడంతో స్థానిక వైద్యులు ఒంగోలు, గుంటూరుకు రెఫర్‌ చేస్తున్నారు.

ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలూ ఉద్యమ బాట:

ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ సీపీ, సీపీఐ, సీపీఎంతోపాటు ఇతర ప్రజా సంఘాల నాయకులు మెడికల్‌ కాలేజీ కోసం రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, ధర్నాలు, సబ్‌కలెక్టరుకు వినతిపత్రాలు అందచేయడం, ప్రదర్శనలు నిర్వహించి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రజాగ్రహాన్ని చంద్రబాబు ప్రభుత్వానికి వినిపిస్తున్నారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించి మాజీ ఎంఎల్‌సీ లక్ష్మణరావు, డాక్టర్‌ ఆళ్ల వెంకటేశ్వర్లు, మాజీ ఆర్ధిక శాఖ కార్యదర్శి పీవీ రమేష్‌ తదితరులు ఇక్కడికి వచ్చి పీపీపీ విధానం వలన వచ్చే నష్టాలను తెలిపారు.

జీజీహెచ్‌ కూడా పీపీపీ విధానంలోకి..

మెడికల్‌ కళాశాలతోపాటు జీజీహెచ్‌ను కూడా పీపీపీ విధానంలోకి మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 2వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వైద్యసేవలు పశ్చిమ ప్రకాశం ప్రజలకు అందని ద్రాక్షలాగా మారనుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పేదలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు సుదూరం కానున్నాయి. ఎమర్జెన్సీ సర్వీసులు కావాలంటే ప్రాణాలను దేవుడిపై భారంవేసి ఒంగోలు లేదా గుంటూరుకు వెళ్లాలి. నాటి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలోనే మెడికల్‌ కళాశాలకు సంబంధించి సిబ్బంది క్వార్టర్స్‌, నర్సింగ్‌ కళాశాల, జంట్స్‌, లేడీస్‌ హాస్టల్స్‌, సెంట్రల్‌ క్యాంటీన్‌ ఇలా అనేక భవన నిర్మాణ పనులను దాదాపు పూర్తి చేశారు. జీజీహెచ్‌లో 420 బెడ్లను సిద్ధం చేశారు. జనరల్‌ సర్జరీ కోసం 100, జనరల్‌ మెడిసిన్‌ 100, ఆర్ధోపెడిక్‌ విభాగానికి 40, ఆప్తమాలజీకి 20, డెర్మటాలజీ 10, సైక్రియాట్రి విభాగానికి 10, ఈఎన్‌టీకి 20, ఐసీయూకి 20, పీడియాట్రిక్స్‌ 50, గైనకాలజీకి 50 బెడ్లు కేటాయించారు. ఇప్పుడు ఇవన్నీ జీజీహెచ్‌లో కనిపించడం లేదు.

నిర్మాణ సామగ్రి, వైద్య పరికరాల తరలింపు..

గత ఏడాది నవంబర్‌ 5,6 తేదీల్లో మెడికల్‌ కళాశాల నిర్మాణ సంస్థ కళాశాల ఆవరణలో ఉన్న సామగ్రిని తరలించే ప్రక్రియ ప్రారంభించింది. వైద్య పరికరాలను కూడా తరలించారు. దీంతో వ్యాధి నిర్ధారణ పరీక్షలు కూడా రోగులకు దూరం కావడంతోపాటు ప్రైవేటు వైద్యశాలకు వెళితే భారం కానున్నాయి. ఇప్పటికే ఇక్కడ ఉన్న అత్యాధునిక వైద్య పరికరాలను రాష్ట్రంలోని వివిధ మెడికల్‌ కళాశాలలకు తరలించారు. పేరుకు మాత్రమే జీజీహెచ్‌ సేవల్లో మాత్రం పీహెచ్‌సీలా తయారైంది. పీపీపీ విధానం అమలైతే పరిస్థితి ఇంకా దారుణంగా మారనుంది.

మెడికల్‌ కాలేజీని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల ఉద్యమం చేపట్టింది. ఈ ఉద్యమంలో జిల్లాలోని ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. పీపీపీ విధానంపై ఆగ్రహించారు. మెడికల్‌ కాలేజీని ప్రభుత్వమే నిర్వహించాలని నినదించారు. మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో జిల్లాలోనే అత్యధికంగా 85 వేల మంది ప్రజలు సంతకాల రూపంలో తమ నిరసన వ్యక్తం చేశారు. ఇది మార్కాపురం ప్రాంత ప్రజల మనోభావాలను తెలియజేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 5,26,148 సంతకాలు సేకరించినట్లు వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా సేకరించిన సంతకాల పత్రాలను సోమవారం ఒంగోలులోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయం నుంచి తాడేపల్లికి తరలించి ఆ తరువాత గవర్నర్‌కు అందజేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement