ప్రైవేటీకరణపై నిరసన గళమెత్తండి
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ర్యాలీని జయప్రదం చేయండి మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్
సింగరాయకొండ: చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకంగా నిరసన గళమెత్తాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పిలుపునిచ్చారు. కోటి సంతకాల కార్యక్రమం నియోజకవర్గంలో జయప్రదం గా జరిగిందని, ప్రజలు పార్టీలకు అతీతంగా సంతకాలు చేయటం ద్వారా తమ నిరసనను తెలియజేశారని చెప్పారు. మండల కేంద్రంలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాత్రి కోటి సంతకాల కార్యక్రమం పై శ్రీహలో కొండపి..చలో ఒంగోలుశ్రీ వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. డాక్టర్ సురేష్ మాట్లాడుతూ రెండు నెలలుగా సాగుతున్న ఈ ప్రజా ఉద్యమం ద్వారా అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, మంత్రులకు వినతిపత్రాలను కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, పలు రాజకీయ పార్టీలు అందజేశాయని, విద్యార్థి సంఘాల వారు బంద్ కూడా నిర్వహించారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం విద్యా వ్యవస్థకు శాపంలా మారిందన్నారు. ప్రభుత్వానికి ఎన్నో రకాలుగా విజ్ఞాపన పత్రాలు అందించామని, నిరసన ర్యాలీలు చేశామన్నారు. చిట్టచివరి అస్త్రంగా ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు మా నాయకులు, కార్యకర్తల శ్రమ ఫలితంగా కోటి సంతకాలతో సిద్ధం చేసిన వినతి పత్రాలను గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 18వ తేదీన స్వయంగా అందజేయనున్నట్లు వివరించారు. ఈనెల 10వ తేదీ భారీగా ర్యాలీగా నియోజకవర్గంలో సిద్ధం చేసిన 63,162 సంతకాల ప్రతులను ఒంగోలు పార్టీ కార్యాలయానికి చేర్చామన్నారు. సోమవారం నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఉదయం 9 గంటలకు పార్టీ క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీగా బయలు దేరి టంగుటూరు టోల్ గేట్‌కు చేరుకుని అక్కడి నుంచి అందరూ కలిసి ఒంగోలు బయలుదేరి వెళతామని వివరించారు. కలెక్టరేట్ సెంటర్‌లోని వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడి నుంచి తాడేపల్లికి తరలిస్తామని వివరించారు.
పేదలకు అందని ద్రాక్షగా వైద్య విద్య, వైద్యం:
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించటం వలన పేదలకు, బడుగు, బలహీన వర్గాల వారికి వైద్య విద్య, వైద్యం అందని ద్రాక్షలా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జగనన్న 5 మెడికల్ కాలేజీలను ప్రారంభించారన్నారు. పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలను పూర్తి చేశారన్నారు. 650 పడకల ఆస్పత్రులు కూడా సిద్ధమయ్యాయని, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ కాలేజీలకు 150 సీట్లు మంజూరు చేస్తే చంద్రబాబు ప్రభుత్వం వద్దని తిరస్కరించిందన్నారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పై ఇటీవల కాలంలో ఇంతపెద్ద ప్రజాఉద్యమం జరగలేదన్నారు. కోటి సంతకాల సేకరణ పత్రాలను అన్నింటినీ సంతకం చేసిన వ్యక్తి పేరు, ఫోన్ నంబరు, మండలం, గ్రామం పేరుతో ఆన్‌లైన్ చేశామని వివరించారు. ప్రతి వెయ్యి మందికి ఒక డాక్టరు అవసరమని, కానీ రాష్ట్రంలో కేవలం 0.03 శాతం మాత్రమే ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించి ఉంటే 2,500 సీట్లు పెరిగేవన్నారు. ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ఈ పథకం కింద ఆస్పత్రులకు రూ.3,500 కోట్ల బకాయిలు ఉన్నారన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కేవలం టీడీపీ వారికే ఇస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు మసనం వెంకట్రావు, షేక్ సుల్తాన్, చుక్కా కిరణ్‌కుమార్, షేక్ కరీం, లింగాబత్తిన నరేష్, పెరికాల సునీల్, మిరియం సుధాకర్, నాగార్జున, షేక్ అల్లాభక్షు, దాసరి శేషయ్య, దాసు శ్రీనివాసులు, షేక్ మల్లాంగ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


