నేడు ‘కోటి సంతకాల ర్యాలీ’ని జయప్రదం చేయండి
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
ఒంగోలు సిటీ: రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి అంచనాలకు మించి స్పందన వచ్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంతకాల పత్రాల బహిరంగ ర్యాలీ సోమవారం ఒంగోలు చర్చి సెంటర్‌లోని వైఎస్సార్ విగ్రహం వద్ద నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల నుంచి సేకరించిన కోటి సంతకాల ప్రతులు ప్రత్యేక వాహనంలో ఒంగోలు నుంచి తాడేపల్లిలోని కేంద్ర పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నాయని చెప్పారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. నియోజకవర్గ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, జిల్లా నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజాప్రతినిధులు, వివిధ హోదాలో పార్టీ పదవుల్లో ఉన్న నాయకులు, పార్టీ శ్రేణులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
దొనకొండ: దొనకొండ రైల్వే పోలీస్ స్టేషన్‌ను గుంటూరు రైల్వే డివిజన్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ బి.శైలేష్‌కుమార్ ఆదివారం తనిఖీ చేశారు. వార్షిక తనిఖీలో భాగంగా స్టేషన్, రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బందికి సూచన, సలహాలందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైలు దొనకొండకు చేరిన సమయంలో పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, తరచుగా అక్కడక్కడ అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయని, అలాంటివి జరగకుండా చూడాలని సూచించారు. అనుమానితులను గుర్తించి వివరాలను తెలుసుకోవాలన్నారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. ఆయన వెంట ఏఎస్‌ఐ వీరాంజనేయులు, సిబ్బంది ఉన్నారు.
ఒంగోలు: మాస్టర్ అథ్లెటిక్స్ రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు పలు పథకాలు సాధించారు. ఈనెల 13, 14 తేదీల్లో బాపట్ల జిల్లాలో జరిగిన 7వ ఆంధ్రప్రదేశ్ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో ప్రకాశం జిల్లా తరఫున 14 మంది పాల్గొన్నట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ తానికొండ సురేష్‌కుమార్, దాసరి విజయభాస్కర్ తెలిపారు. స్వర్ణ పతకాలు 19, రజతం 12, కాంస్యం 8 వెరసి మొత్తం 39 పతకాలు సాధించినట్లు తెలిపారు. పతకాలు సాధించిన వారిలో ఎన్.లక్ష్మి, కేవీపీ శైలజ, ఎండి అల్లారఖ, కె.మేనక, టి.పద్మావతి, ఎండి హజీరాబేగం, ఎస్.బాలకోటేశ్వరరావు, డి.రవి, ఎం.బ్రహ్మయ్య, కె.భగవాన్, వై.నిరంజన్‌బాబు, కె.జీవన్‌కుమార్, డి.విజయభాస్కర్, డాక్టర్ టి.సురేష్‌కుమార్ ఉన్నారు. పతకాలు సాధించిన వీరంతా జనవరి 30 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు రాజస్థాన్ రాష్ట్రంలో జరిగే 7వ జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించినట్లు పేర్కొన్నారు.
నేడు ‘కోటి సంతకాల ర్యాలీ’ని జయప్రదం చేయండి
నేడు ‘కోటి సంతకాల ర్యాలీ’ని జయప్రదం చేయండి


