19,490 కేసులకుపైగా పరిష్కారం
● జిల్లాలో 29 బెంచీలతో లోక్ అదాలత్
ఒంగోలు: జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా శనివారం జిల్లావ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమంలో 19,490కిపైగా కేసులు పరిష్కారమైనట్లు జిల్లా ఇన్‌చార్జి ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్ టి.రాజ్యలక్ష్మి తెలిపారు. జిల్లావ్యాప్తంగా 29 బెంచీలను కక్షిదారుల సౌకర్యార్థం ఏర్పాటు చేశామన్నారు. ఆయా బెంచీలలో న్యాయమూర్తులతోపాటు న్యాయవాదులు కలిసి 19,240 క్రిమినల్ కేసులు, పది ప్రీలిటిగేషన్ కేసులు, 240 సివిల్ కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి టి.రాజ్యలక్ష్మి మీడియాకు తెలిపారు. కేసుల పరిష్కారంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా వర్గాలకు సంబంధించిన కేసులు కూడా పరిష్కరించినట్లు తెలిపారు. అంతేగాకుండా వివిధ కేసులలో కక్షిదారులకు రూ.5 కోట్లను పరిష్కారం రూపంలో అందజేసినట్లు చెప్పారు. ఆయా కార్యక్రమాలలో జిల్లా అదనపు న్యాయమూర్తులు టి.రాజా వెంకటాద్రి, ఎ.పూర్ణిమ, పందిరి లలిత, సీనియర్ సివిల్ జడ్జిలు హేమలత, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్, జూనియర్ న్యాయమూర్తులు పాల్గొని కేసుల పరిష్కారానికి కృషి చేశారు.


