కర్నూల్–గుంటూరు రహదారిపై రోడ్డు ప్రమాదం
పెద్దదోర్నాల: ఎదురెదురుగా వస్తున్న ఓ కారు, ద్విచక్ర వాహనం ఒకదానికొకటి ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కర్నూల్–గుంటూరు జాతీయ రహదారి చిన్నదోర్నాల అడ్డ రోడ్డు..జమ్మిదోర్నాల గ్రామాల మధ్య శనివారం సాయంత్రం జరిగింది. క్షతగాత్రులను స్థానికులు ఓ ఆటోలో మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రమాదంలో చిలకలూరిపేట సమీపంలోని మల్లాయపాలేనికి చెందిన వెంకట మాధవి, దూదేకుల యాసిన్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీశైలంలో దైవదర్శనం ముగించుకుని మోటారు సైకిల్‌పై స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న మోటారు సైకిల్ జమ్మిదోర్నాల వద్దకు చేరుకుంది. గుంటూరు నుంచి శ్రీఽశైలం వెళ్తున్న కారు అతి వేగంతో మోటారు సైకిల్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో వెంకట మాధవి కుడికాలు మోకాలి వరకు నలిగిపోయింది. దూడేకుల యాసిన్ చేతి వేళ్లతో పాటు పలు చోట్ల గాయాలయ్యాయి. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం నర్సారావుపేటకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఎదురెదురుగా వచ్చిన కారు, మోటారు సైకిల్ ఢీ
మోటారు సైకిల్‌పై ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలు


