ఆశలు..ఎర్రబారి..!
గత ఏడాది మద్దతు ధర రాక తగ్గిన మిర్చి సాగు విస్తీర్ణం ప్రస్తుతం జిల్లాలో 33 వేల ఎకరాల్లో సాగు మోంథా తుపానుతో విజృంభిస్తున్న తెగుళ్లు దాదాపు 15 వేల ఎకరాల్లో సోకిన కుచ్చు తెగులు ఎకరాకు రెండు క్వింటాళ్ల మేర తగ్గనున్న దిగుబడి రైతులకు రూ.45 కోట్లకు పైగా నష్టం ఆందోళనలో మిర్చి రైతులు
తెగులు సోకిన మిర్చి పైరు
మార్కాపురం:
రెండేళ్లుగా మిర్చిరైతులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎర్ర బంగారమని నమ్మి సాగు చేసి నష్టాల్లో మునిగిపోయారు. జిల్లాలో ప్రధానంగా మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి నియోజకవర్గాల్లో మిర్చిని ఎక్కువగా సాగు చేస్తారు. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో రెండేళ్లతో పోల్చుకుంటే సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. 2023 సంవత్సరంలో జిల్లాలో 96 వేల ఎకరాల్లో సాగు చేశారు. ధరలు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడిన రైతులు సాగును కుదించేసుకున్నారు. 2024లో 66,387 ఎకరాల్లో సాగు చేశారు. ఈ ఏడాది పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. చంద్రబాబు ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోవడంతో చేసిన అప్పులు తీర్చే దారి కనిపించక పశ్చిమాన రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. గత ఏడాది సాగు విస్తీర్ణంతో పోల్చుకుంటే ఈ ఏడాది సగానికి సగం పడిపోయింది. జిల్లాలో సుమారు 33,291 ఎకరాల్లో మాత్రమే మిర్చిని పండిస్తున్నారు. ఈ సారి మోంథా తుపాను వీరిపాలిట విలన్‌గా మారింది. తుపాను తర్వాత మిర్చి పంటకు తెగుళ్ల బెదడ పట్టుకుంది. దీనిపై నల్లతామర, కుచ్చుముడత (వైరస్) తదితర తెగుళ్లు విజృంభిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 15 వేల ఎకరాల్లో ఈ తెగుళ్లు సోకినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఊహించని విధంగా మిర్చికి నల్లతామర, వైరస్ తెగులు సోకడంతో రైతులు విలవిల్లాడిపోతున్నారు.
భారీగా పడిపోనున్న దిగుబడి..
మిర్చి పంటకు తెగుళ్లు సోకడంతో దిగుబడి భారీగా పడిపోయే అవకాశాలు ఉన్నాయని ఉద్యానవనశాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఎకరాకు 2 క్వింటాళ్ల చొప్పున మొదటి రెండు కోతల్లోనే దిగుబడులు తగ్గుతున్నాయని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో దాదాపు 30 వేల క్వింటాళ్ల దిగుబడి తగ్గిపోనుంది. దీంతో ఈ ఏడాది కూడా వారికి నష్టాల పోటు తప్పట్లేదు. గుంటూరు మార్కెట్ యార్డులో ప్రస్తుతం రూ.15 వేల నుంచి రూ.16 వేల మధ్య ధర పలుకుతోంది. ఈ లెక్కన క్వింటా రూ.15 వేల ప్రకారం రూ.45 కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. మిర్చి సాగుకు ఒక్కొక్క రైతు సుమారు రూ.1 లక్ష పైనే ఖర్చుచేశారు.
తామర పురుగును అరికట్టుకోవాలి
మిర్చిలో తామర పురుగు సోకింది. దీంతోపాటు తెల్లదోమలు, అఫిట్స్ వైరస్ తెగులు వచ్చింది. ఇవి రసం పీల్చడం, పూత, కాయలను దెబ్బతీయడం ద్వారా దిగుబడులను తగ్గిస్తున్నాయి. రాత్రిపూట గాలిలో తేమ ఎక్కువగా ఉండటం, పగటిపూట పొడి వాతావరణంలో ఉధృతి ఎక్కువగా ఉంటే వ్యాపిస్తాయి. జనవరి వరకూ రైతులు ఈ తెగుళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. నివారణకు సేంద్రియ పద్దతులు, వేపనూనె, పసుపురంగు అట్టలు, పంట శుభ్రత పాటించాలి. కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. తెగులు సోకిన ఆకులను తొలగించాలి. నీలం, పసుపురంగు జిగురు అట్టలను పొలంలో ఏర్పాటు చేసుకోవాలి.
– లక్ష్మీనారాయణ, వ్యవసాయాధికారి, పెద్దారవీడు
ఆశలు..ఎర్రబారి..!
ఆశలు..ఎర్రబారి..!


