అప్పులకు బాబు లెక్కలు చెప్పాలి
ఇప్పటికే రూ.2.50 లక్షల కోట్ల అప్పులు సంక్షేమ పథకాలకు కోత.. సకాలంలో ఉద్యోగులకు అందని జీతాలు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై పోరాటం ఆగదు కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి అనూహ్య స్పందన జిల్లాలో 5.26 లక్షల మంది సంతకాలు 15వ తేదీ ఒంగోలులో భారీ ర్యాలీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
ఒంగోలు సిటీ: ‘‘ప్రభుత్వం నడపాల్సిన మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ ముసుగులో తన బినామీలకు కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నారు. మరో వైపు ఖరీదైన భూములను కారుచవగ్గా ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారు. ఇదేనా సంపద సృష్టి ..’’ అంటూ సీఎం చంద్రబాబుపై దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివరప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మండిపడ్డారు. పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం, వైద్య విద్య అందుబాటులోకి తెచ్చేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 మెడికల్ కళాశాలలను తీసుకొస్తే నేడు అందులో 10 కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకునేంత వరకూ మా పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. అత్యంత విలువైన ప్రభుత్వ భూములను లూలూ వంటి ప్రైవేటు సంస్థలకు కారు చవగ్గా కట్టబెట్టడం సరికాదని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు చంద్రబాబు సంపద సృష్టిస్తా అంటూ వాగ్దానాలు చేశారని, తమ బినామీల కోసం, వాళ్ల పార్టీ నాయకుల కోసం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం, ప్రభుత్వ భూములను చవగ్గా కట్టబెట్టడం చూస్తుంటే మీ సంపద సృష్టి అంతా మీ వాళ్ల కోసమేనా అని ఆయన నిలదీశారు.
రూ.లక్షల కోట్ల అప్పులకు లెక్క చెప్పాలి..
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకూ రూ.2.50 లక్షల కోట్లు అప్పు చేశారని, వాటిని దేని కోసం వినియోగిస్తున్నారో లెక్క చెప్పాలని బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలకు కోతలు పెట్టారు..సూపర్ సిక్స్ అమలు కావడం లేదు.. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడంలేదు.. మరి అప్పు తెచ్చిన డబ్బు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అటు అమరావతి కట్టడంలేదు..ఇటు ప్రజలకు ఉపయోగపడే పనులేమీ చేయడం లేదు.. ప్రభుత్వం నడపాల్సిన మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారు. ఈ డబ్బులు ఏం చేస్తున్నారో లెక్కలు చెప్పాలని ప్రజలే కోరుతున్నారన్నారు. రూ.4 వేల కోట్లు ఖర్చుచేస్తే పది మెడికల్ కశాళాలను ప్రభుత్వమే నడపొచ్చన్నారు. రైతులు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధరలు రాక అన్ని రకాల రైతులు కుదేలవుతున్నారని అన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 75 కేజీల వరిమూటకు రూ.1800 నుంచి రూ.2 వేలు ఉంటే నేడు రూ.1300 కూడా రావడం లేదన్నారు. ఆర్‌బీకేల ద్వారా రైతులకు మద్దతు ధర వచ్చేలా జగన్ చర్యలు తీసుకున్నారన్నారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం దళారులకు కొమ్ముకాస్తూ రైతులను అన్యాయం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. రైతులకు మద్దతు ధర వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోంథా తుపానుతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోలేదని విమర్శించారు. సాగర్ జలాలను చివరి భూముల వరకూ ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
15న ఒంగోలులో భారీ ర్యాలీ..
మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చిన కోటి సంతకాల ఉద్యమానికి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో మంచి స్పందన వచ్చిందని బూచేపల్లి తెలిపారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల నుంచి సంతకాల సేకరణ ప్రతులు జిల్లా కార్యాలయానికి చేరాయని చెప్పారు. జిల్లాలో 5,26,148 పత్రాలపై సంతకాలు చేశారన్నారు. మార్కాపురం నియోజకవర్గంలో 85 వేలు వరకూ వచ్చాయన్నారు. ఇది ఆ ప్రాంత ప్రజల మనోభావాలను తెలియజేస్తుందన్నారు. పశ్చిమ ప్రకాశం ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు జగన్ మార్కాపురంలో మెడికల్ కళాశాలను నిర్మిస్తే దానిని చంద్రబాబు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కొత్తగా జిల్లాకు తాము వ్యతిరేకం కాదని, మార్కాపురం జిల్లాకు ఆర్థిక వనరులు ఏంటి.. నిధులు కేటాయించకుండా ఆ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. 15వ తేదీ ఉదయం 10 గంటలకు ఒంగోలు చర్చి సెంటర్‌లోని వైఎస్సార్ విగ్రహం వద్ద నుంచి పార్టీ జిల్లా కార్యాలయం వరకూ వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొట్ల రామారావు, వైఎస్సార్ సీపీ నాయకులు చింతలచెరువు సత్యనారాయణరెడ్డి, దుంపా చెంచురెడ్డి, ఉప్పలపాటి ఏడుకొండలు, గోనుగుంట రజనీ, గౌతమ్ అశోక్, రాయిని వెంకటరావు, పెట్లూరు ప్రసాద్, బాలినేని శ్రీనివాసరెడ్డి, సయ్యద్ అప్సర్, షేక్ మీరావలి, తదితరులు పాల్గొన్నారు.


