స్మార్ట్‌ మిథ్యాహ్నం | - | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ మిథ్యాహ్నం

Nov 27 2025 5:56 AM | Updated on Nov 27 2025 5:56 AM

స్మార్ట్‌ మిథ్యాహ్నం

స్మార్ట్‌ మిథ్యాహ్నం

స్మార్ట్‌ కిచెన్‌ల ద్వారా మరో దోపిడీకి రంగం సిద్ధం తమ అనుయాయుల జేబులు నింపేందుకు బాబు సర్కార్‌ కుట్ర మధ్యాహ్న భోజన పథకం కార్మికుల నోట్లో మన్ను ఏళ్ల తరబడి దీనినే నమ్ముకున్న కార్మికులను రోడ్డుపైకి.. జిల్లా వ్యాప్తంగా తొలిదశలో 10 స్మార్ట్‌ కిచెన్లు 187 పాఠశాలల్లో 22 వేల మంది విద్యార్థులకు భోజనం తయారు విద్యార్థులకు ఇక వేడి అన్నంలేనట్లే ఈ పథకాన్ని నీరుగార్చే కుట్రగా అభివర్ణిస్తున్న యూనియన్‌ నాయకులు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:

జిల్లా వ్యాప్తంగా 2,327 ప్రాథమిక, ప్రాథమికోన్నత, హైస్కూళ్లు ఉన్నాయి. వీటిల్లో 1,35,444 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించాల్సి ఉంది. అయితే రోజూ సుమారు 87 వేల మంది విద్యార్థులు మాత్రమే భోజన పథకానికి హాజరవుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకానికి డొక్కాసీతమ్మ పేరు పెట్టారు. దీని ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందించాల్సింది పోయి తమ అనుయాయలకు మేలు జరిగే రీతిలో ప్రభుత్వ పెద్దలు సిద్ధమవుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్మార్ట్‌కిచెన్‌ పేరుతో పార్టీ వారి జేబులు నింపేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించి నివేదికలు పంపాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఆమేరకు జిల్లా అధికారులు ఆగమేఘాలపై ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. పైలట్‌ ప్రాజెక్టు పేరుతో జిల్లాలోని ఒంగోలు, మార్కాపురం నియోజకవర్గాల్లో రెండేసి చొప్పున, మిగతా సంతనూతలపాడు, కొండపి, దర్శి, కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున స్మార్ట్‌ కిచెన్లు ఏర్పాటు చేయనున్నారు. 10 స్మార్ట్‌ కిచెన్లు ఏర్పాటు చేసి 18 రూట్ల ద్వారా 187 పాఠశాలలకు చెందిన 22,031 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తయారు చేసి అందించాలని ప్రతిపాదించారు. ఒక చోట భోజనం తయారు చేసి 1 నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న విద్యార్థులకు భోజనం అందించాలన్నది ప్రభుత్వం ఆలోచన.

పైలెట్‌ ప్రాజెక్టుగా..

ఒంగోలులోని పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసే స్మార్ట్‌ కిచెన్‌ ద్వారా 2 కిలోమీటర్ల పరిధిలోని 21 పాఠశాలలకు భోజనం అందించాలని, త్రోవగుంట జెడ్పీ స్కూల్‌లో స్మార్ట్‌ కిచెన్‌ ఏర్పాటు చేసి చుట్టు పక్కల ఉన్న మరో 21 పాఠశాలలకు భోజనం అందించాలని ప్రణాళిక రూపొందించారు. ఈ రెండు కిచెన్లతో 40 మందికి పైగా ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. అలాగే మార్కాపురం, పొదిలి కేంద్రాల్లో ఏర్పాటు చేసే కేంద్రాల ద్వారా 27 మంది కార్మికులు రోడ్డున పడనున్నారు. ఈ పథకాన్ని జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తే ప్రభుత్వం ఈ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్న వేలాది మంది కార్మిక కుటుంబాలు రోడ్డున పడిపోతాయని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

విద్యార్థులకు వేడి అన్నం లేనట్లే...

ఎక్కడో 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న విద్యార్థులకు ఒక చోట భోజనం వండి వాహనాల్లో తీసుకెళ్లి ఇవ్వడం అన్నది వ్యయప్రసాలతో కూడుకుంది. దీనివలన విద్యార్థులకు వేడి అన్నం తినే భాగ్యం లేనట్లే అని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అధికారులు సిద్ధం చేసిన ప్రతిపాదనలు పరిశీలిస్తే తెల్లవారు జామున వంట ప్రారంభిస్తే కానీ విద్యార్థులకు సకాలంలో భోజనం అందించలేని పరిస్థితి. ఇప్పటి దాకా పాఠశాల ఆవరణలోనే మధ్యాహ్న భోజనం వండేవారు. ఈ పథకాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పర్యవేక్షించేవారు. ఏరోజుకారోజు వండిన ఆహారాన్ని ఉపాధ్యాయులు స్వయంగా రుచి చూసిన తరువాతే విద్యార్థులకు వడ్డించేవారు. ఆహారం నాణ్యత, రుచి గురించి టెస్టింగ్‌ రిజిస్టర్‌లో నమోదు చేసేవారు. మెనూ ప్రకారం వంటవండేలా చూసేవారు. ఇప్పుడా పరిస్థితి కాంట్రాక్టర్ల చేతుల్లోకి పోతుంది. వారు వండిందే వడ్డించే పరిస్థితి ఉంటుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. దీని వలన విద్యార్థులకు పౌష్టికాహారం అనుమానమేనని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరిని సంతృప్తి పరచడానికి స్మార్ట్‌ కిచెన్లు తీసుకొస్తున్నారని ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. బడుగు, బలహీన వర్గాలకు ఆధారంగా ఉన్న ఈ పథకాన్ని బడా వ్యక్తులకు ఆదాయ వనరుగా ఎందుకు మారుస్తున్నారని నిలదీస్తున్నారు. సొంత పార్టీ నాయకుల బొజ్జలు నింపేందుకే స్మార్ట్‌ కిచెన్‌ పథకం రూపకల్పన జరిగినట్లు కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

రోడ్డున పడనున్న మధ్యాహ్న భోజన కార్మికులు...

ఈ స్మార్ట్‌ కిచెన్లతో వేలాది మంది మధ్యాహ్న భోజన కార్మికుల జీవితాలు రోడ్డున పడే దుస్థితి నెలకొందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పథకం కింద జిల్లాలో మొత్తం 4112 మంది కార్మికులు పనిచేస్తున్నారు. స్మార్ట్‌ కిచెన్‌లు అమలైతే పాఠశాలలో ఉన్న వంటశాలలు మూతపడి కార్మికులు ఇంటిదారి పట్టాల్సిందే. వీరిలో 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వారున్నారు. దశాబ్దాలుగా పనిచేస్తున్న కార్మికుల పొట్టలు కొట్టి పార్టీ నాయకుల బొజ్జలు నింపేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement